Saturday, November 23, 2024

Women’s Series | పాకిస్తాన్‌ సంచలనం.. కివీస్‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ కైవసం

పాకిస్తాన్‌ మహిళల క్రికెట్‌ జట్టు సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకొని కొత్త చరిత్ర లిఖించుకుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌ గెలుచుకున్న పాక్‌ అమ్మాయిలు రెండో టీ20లోనూ ఆతిథ్య కివీస్‌ను 10 పరుగులతో ఓడించారు. దాంతో మూడు మ్యాచ్‌లు సిరీస్‌ను పాక్‌ 2-0తో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. కాగా 2018 డిసెంబర్‌ తర్వాత పాక్‌ మహిళా జట్టు ఆసియాలో కాకుండా విదేశీ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ గెలుచుకోవడం విశేషం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఓపెనర్‌ మునీబా అలీ (35; 28 బంతుల్లో 6 ఫోర్లు), ఆలియా రియాజ్‌ (32 నాటౌట్‌; 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), బిస్మా మారూఫ్‌ (21), కెప్టెన్‌ నిదా దార్‌ (14) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్యచేదనకు దిగిన న్యూజిలాండ్‌కు పాక్‌ బౌలర్లు ఫాతిమా సనా (3/22), సాదియా ఇక్బాల్‌ (2/29) హడలెత్తించారు.

కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్‌ బ్యాటర్లపై విరుచుకపడ్డారు. దాంతో న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులే చేయగలిగింది. హన్నా రోవ్‌ (33; 24 బంతుల్లో 3 ఫోర్లు), జార్జియా ప్లిమ్మర్‌ (28; 28 బంతుల్లో 3 ఫోర్లు) తప్ప మిగతా బ్యాటర్లు చేతులెత్తయడంతో కివీస్‌ 10 పరుగులతో ఓటమితో పాటు సిరీస్‌ను కూడా కోల్పోయింది. దూకుడుగా బ్యాటింగ్‌ చేసి పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆలియాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement