ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్‌ఇండియా పాకిస్థాన్‌కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్‌లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది. వచ్చే ఏడాది జరిగే ఈ టోర్నీ కోసం మూడు వేదికలను ఖరారు చేసింది. లాహోర్, కరాచి, రావల్పిండిలో టోర్నీ మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ”ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీకి పంపించాం.
లాహోర్, కరాచి, రావల్పిండిలను వేదికలుగా ఎంపిక చేశాం. బోర్డు భద్రత బృందం పాక్‌కు వచ్చి ఏర్పాట్లను పరిశీలించింది. టోర్నీని సజావుగా నిర్వహిస్తామనే నమ్మకం ఉంది” అని పీసీబీ ఛైర్మన్ మోహిస్ నఖ్వి తెలిపాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరుగుతుందని భావిస్తున్న ఈ ఈవెంట్లో పాల్గొనే విషయాన్ని భారత్ ఇంకా ఖరారు చేయలేదు. గతేడాది పాక్ ఆతిథ్యం ఇచ్చిన ఆసియాకప్‌లో పాక్‌లో ఆడటానికి భారత్ నిరాకరించడంతో.. ‘హైబ్రిడ్ మోడల్’లో కొన్ని మ్యాచ్‌లు పాక్‌లో కొన్ని శ్రీలంకలో నిర్వహించారు. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లు తామే నిర్వహించాలని పాక్ పట్టుదలగా ఉంది.