Friday, October 18, 2024

Irland: ప‌సికూన చేతిలో పాక్ చిత్తు

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. డబ్లిన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి 182 పరుగులు చేసింది. దానికి సమాధానంగా ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఆటగాడు ఆండీ బల్బిర్నీ (55 బంతుల్లో 77 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

- Advertisement -

టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ రెండో ఓవర్లో అనుభవజ్ఞుడైన మహ్మద్ రిజ్వాన్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔట్ కావడంతో పేలవమైన ఆరంభం లభించింది. ఇక్కడి నుంచి సామ్ అయూబ్, కెప్టెన్ బాబర్ ఆజం మధ్య అద్భుతమైన భాగస్వామ్యం కనిపించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించి స్కోరును 90 దాటించారు. అయూబ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. అదే సమయంలో, బాబర్ అర్ధ సెంచరీని సాధించాడు. అయితే 43 బంతుల్లో 57 పరుగులు చేసిన తర్వాత 15వ ఓవర్లో 116 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు.

17 ఏళ్ల తర్వాత మళ్లీ ఓడిన పాకిస్థాన్‌..

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్‌కు కూడా ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగలడంతో ఆ జట్టు స్కోరు 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి ఆండీ బాల్‌బిర్నీ, హ్యారీ టెక్టర్‌ల జోడీ బాధ్యతలు స్వీకరించి స్కోరును 100కు చేర్చింది. టెక్టర్ 27 బంతుల్లో 36 పరుగులు చేశాడు. కాగా, జార్జ్ డాక్రెల్ 12 బంతుల్లో 24 పరుగులు చేశాడు. బల్బిర్నీ అర్ధ సెంచరీ సాధించాడు. అయితే, అతను కూడా 55 బంతుల్లో 77 పరుగుల ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

మ్యాచ్ ఐర్లాండ్ చేతుల్లోంచి జారిపోతుందని అనిపించినా గారెత్ డెలానీ (10), కుర్టిస్ కాంఫర్ (15) మరో బంతి మిగిలి ఉండగానే తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. పాకిస్థాన్ తరపున అబ్బాస్ అఫ్రిది అత్యధికంగా రెండు వికెట్లు తీశాడు.

ఇంతకుముందు 2007లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఐర్లాండ్ జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది. అయితే, అప్పటి నుంచి ఆ జట్టు ప్రతిసారీ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, ఈసారి అలా జరగకపోవడంతో ఐర్లాండ్ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లోని తదుపరి మ్యాచ్ మే 12న డబ్లిన్‌లో జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement