మరికొద్ది గంటల్లో పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి తెరలేవనుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియాను జస్‌ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు. ఈ క్రమంలోనే గురువారం నిర్వహించిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్సీ హోదాలో బుమ్రా పాల్గొన్నాడు. టీమ్ ప్రిపరేషన్స్‌తో పాటు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
కెప్టెన్సీ పరంగా బ్యాటర్ల కంటే బౌలర్లు చాలా వ్యూహాత్మకంగా ఉంటారని.. సారథ్య బాధ్యతలు బౌలర్లకు అప్పగించడమే ఉత్తమమని టీమిండియా తాత్కాలిక టెస్టు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. ‘కెప్టెన్సీ బాధ్యతలను నేను గౌరవంగా భావిస్తాను. సారథిగా నాకంటూ ప్రత్యేకమైన శైలి ఉంది. పేసర్లు కెప్టెన్‌గా ఉండాలని నేను చాలా రోజులుగా చెబుతున్నాను.
బ్యాటర్ల కంటే పేసర్లే వ్యూహాత్మకంగా మెరుగు. మైదానంలో వారి వ్యూహాలు చాలా భిన్నంగా ఉంటాయి. ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. గతంలో కపిల్ దేవ్‌తో పాటు చాలా మంది పేసర్లు సారథులుగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. టీమిండియాలో ఈ కొత్త సంప్రదాయానికి ఇది ఆరంభం అనుకుంటున్నాను. అని అన్నాడు.
ఆ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం..
న్యూజిలాండ్‌తో ఎదురైన పరాజయం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై ఏ మాత్రం ప్రభావం చూపదు. ఎందుకంటే గెలిచినా.. ఓడినా మళ్లీ సున్నాతోనే మొదలుపెట్టాలి. భారత్‌లో ఎదురైన ఘోర ఓటమి భారాన్ని ఇక్కడికి మోసుకురాలేదు. కాకపోతే ఆ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. అయితే అక్కడి పరిస్థితులు వేరు. ఇక్కడ భిన్నమైన పరిస్థితుల్లో ఆడబోతున్నాం. ఫలితాలు కూడా భిన్నంగా ఉంటాయి. తుది జట్టుపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాం. కానీ టాస్ సమయంలోనే తుది జట్టును వెల్లడిస్తాం.’అని జస్‌ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు.
కుర్రాళ్లతో టీమిండియా..
మరోవైపు భారత జట్టులోని చాలా మందికి ఆసీస్ పర్యటన ఇదే తొలిసారి. సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ ఇప్పటి వరకు ఆసీస్ తరహా పేస్ పిచ్‌లపై ఆడలేదు. ఈ క్రమంలోనే ఘోర పరాజయంతో ఢీలా పడిన భారత్‌ను ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఆసీస్ భావిస్తోంది. దాంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వర్షం ముప్పు..
ఇక పెర్త్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం పెర్త్‌లో అన్‌సీజనల్ వర్షాలు పడుతున్నాయి. టాస్ సమయంలో అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం 25 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వర్ష ప్రభావం కాసేపే కొనసాగనుంది. అది కూడా తొలి రోజు మాత్రమే.