భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు బెర్తు దక్కింది. గత కొన్ని నెలలుగా జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్‌ఐ)పై అలుపెరుగకుండా పోరాడిన వినేశ్.. ఏషియన్ ఒలింపిక్ క్వాలిఫయర్‌లో తనలో చేవ తగ్గలేదని చేతల్లో చూపెట్టింది.
శనివారం జరిగిన మహిళల 50కిలోల విభాగంలో బరిలోకి దిగిన వినేశ్ తొలి రౌండ్‌లో మిరాన్ చియాన్(కొరియా)పై, క్వార్టర్స్‌లో సామనగ్ డిట్(కాంబోడియా)పై, సెమీస్‌లో లౌరా గానిక్‌జి(కజకిస్థాన్)పై విజయాలు సాధించింది.
ఇలా వరుసగా రియో(2016), టోక్యో(2020), పారిస్(2024) విశ్వక్రీడలకు వినేశ్ బెర్తు దక్కించుకుంది. మరోవైపు అన్షు మాలిక్(57కి), రితిక(76కి) పారిస్ టికెట్ ఖరారు చేసుకున్నారు. దీంతో మెగాటోర్నీకి అర్హత సాధించిన భారత రెజ్లర సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఇప్పటికే అంతిమ్ పంగల్(53కి) క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే.