Tuesday, September 17, 2024

Haryana | వినేష్ ఫోగ‌ట్ కు బంగారు ప‌త‌కం…

పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. ఆమెకు బంగారు పతకం లభించింది. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని హర్యానాలోని సర్వ్ ఖాప్ పంచాయత్ గోల్డ్ మెడల్‌ను ప్రదానం చేసింది.

ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫొగట్‌ ఫైనల్స్‌ వరకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తుదిపోరులో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సి ఉండగా.. బౌట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు డిస్ క్వాలిఫై అయ్యారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగట్ అనర్హత వేటుకు గురయ్యారు. ఫలితంగా ఒక్క పతకం కూడా దక్కించుకోలేకపోయారు.

తనపై పడిన అనర్హత వేటుపై వినేష్ ఫొగట్ న్యాయపోరాటం చేశారు. కోర్టులో కూడా ఆమెకు ఊరట లభించలేదు. ఈ పరిస్థితుల్లో భారత్‌కు తిరిగి వచ్చిన వినేష్ ఫొగట్‌కు హర్యానా ఖాప్ పంచాయత్ బంగారు పతకంతో గౌరవించింది. 30వ పుట్టినరోజు నాడు ఆమెకు ఈ మెడల్‌ను అందజేసింది. ఖాప్ పంచాయత్ తన సొంత నిధులతో దీన్ని తయారు చేయించింది. ఈ పతకంపై ఒలింపిక్స్ సింబల్, 2024 అనే అక్షరాలను ముద్రించింది.

దీనిపై వినేష్ ఫొగట్ స్పందించారు. తన సొంత ఊరిలో, సొంత మనుషుల మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. అంతకుమించి హర్యానా ఖాప్ పంచాయత్ తనకు బంగారు పతకాన్ని బహూకరించడం చిరస్మరణీయంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement