Tuesday, November 19, 2024

Cricket | అక్టోబర్‌లో వన్డే ప్రపంచకప్‌.. 5న ప్రారంభం, నవంబర్‌ 19న ఫైనల్‌ మ్యాచ్​

భారతదేశం ఆతిథ్యమిస్తున్న 2023 ప్రపంచకప్‌ వన్డే టోర్నీ అక్టోబర్‌ 5న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుందని సమాచారం. మొత్తంగా 46 రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగుతుంది. 10 జట్ల మధ్య 48 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా 12 వేదికలను బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

క్రిక్‌ఇన్‌ఫో నివేదిక ప్రకారం.. అహ్మదాబాద్‌తోపాటు, బెంగళూరు, ఢిల్లి, చెన్నై, ధర్మశాల, హైదరాబాద్‌, కోల్‌కతా, లక్నో, ఇండోర్‌, రాజ్‌కోట్‌, ముంబై ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌కు ఆతిథ్యమిచ్చిన మొహాలీ, నాగపూర్​ ప్రపంచకప్‌కు వేదిక కాకపోవడం విశేషం. చివరిసారిగా భారతదేశం 2011లో వన్డే ప్రపంచకప్‌ను నిర్వహించింది. స్వదేశంలో జరిగిన మెగాటోర్నీలో టీమిండియా టైటిల్‌ విజేతగా నిలిచింది. రెండుసార్లు ప్రపంచకప్‌ విజేత అయిన టీమిండియాకు రోహిత్‌శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

రోహిత్‌ నాయకత్వంలో గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో జరిగే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా రోహిత్‌ నాయకత్వంలోనే ఫైనల్‌కి చేరిన సంగతి తెలిసిందే. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్‌ విన్‌ సాధించింది. 2023 మెగా ఈవెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా అడుగుపెడుతోంది.

పన్ను మినహాయింపు సమస్యలు, పాకిస్తాన్‌ వైపు వీసా క్లియరెన్స్‌ల కారణంగా ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో జాప్యం జరిగినట్లు సమాచారం. 2016 టీ20 ప్రపంచకప్‌, 2021 టీ20 ప్రపంచకప్‌, 2023 వన్డే ప్రపంచకప్‌లకు ఆతిథ్య హక్కులు భారత్‌కు దఖలు పడ్డాయి. ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్తాన్‌ జట్టు వీసాలను భారత ప్రభుత్వం క్లియరెన్స్‌ చేయడంపై బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి హామీ ఇచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

ఫైనల్‌కు భారత్‌-పాక్‌: అక్తర్‌
వన్డే ప్రపంచకప్‌-2023 గురించి పాక్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ భారత్‌- పాక్‌ మధ్య జరుగుతుందని చెప్పాడు. అదే జరిగితే 2011లో జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని బాబర్‌ ఆజం నేతృత్వంలోని పాక్‌ జట్టుకు విజ్ఞప్తి చేశాడు. భారత్‌ వేదికగా 2011 ప్రపంచకప్‌ జరిగిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో శ్రీలంక జట్టును మట్టికరిపించి టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ను సాధించింది.

అంతకు ముందు సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో పాక్‌ ఘోర పరాజయం పాలైంది. ఓ స్పోర్ట్స్‌ ఛానెల్‌తో అక్తర్‌ మాట్లాడుతూ.. ‘2023 వన్డే ప్రపంచకప్‌లో నాకు భారత్‌-పాక్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కావాలి. ఈ సారి 2011లో జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అన్నాడు. ఈ సందర్భంగా ఆసియాకప్‌ వివాదంపై సైతం స్పందించాడు. మోడీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే పాక్‌లో ఆడేందుకు బీసీసీఐ అంగీకరిస్తుందని చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement