Saturday, October 5, 2024

Ishan Kishan | న‌న్నేవ‌రూ అర్ధం చేసుకోలా…

గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌ జట్టులో చోటు దక్కించుకోవడంతో పాటు టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహించిన యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఒక్క ఫార్మాట్‌లో కూడా అతడికి చోటు దక్కడం లేదు. అంతేకాదు ఇప్పుడిప్పుడే చోటు దక్కే సూచనలు కూడా కనిపించడం లేదు.

గతేడాది స్వదేశంలోనే అందుబాటులో ఉండి కూడా రంజీ ట్రోఫీ ఆడకపోవడమే దీనంతటికీ కారణంగా ఉంది. మానసికంగా అలసటగా ఉందంటూ గతేడాది దక్షిణాఫ్రికా టూర్‌ నుంచి ఇషాన్ కిషన్ వైదొలిగాడు. అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. అయితే అందుబాటులో ఉన్నప్పటికీ జార్ఖండ్‌ తరపున దేశవాళీ క్రికెట్‌ ఆడకపోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వార్షిక కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అంతేకాదు జట్టులో అతడికి చోటు కూడా ఇవ్వలేదు. అయితే తన వ్యవహారంపై గతంలోనే స్పందించిన ఇషాన్ కిషన్ తాజాగా మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాను పరుగులు చేస్తున్న సమయంలోనూ బెంచ్‌కే పరిమితం అయ్యేవాడినని, అయితే ఆటలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఇషాన్ కిషన్ వ్యాఖ్యానించాడు.

ఏదేమైనప్పటికీ తాను ప్రయాణ అలసటకు గురయినట్టు భావించానని, ఏదో తప్పు జరుగుతోందని అనిపించిందని, అందుకే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. అయితే దురదృష్టవశాత్తు తన కుటుంబం, ఇతర కొంతమంది సన్నిహితులు మినహా ఎవరూ తనను అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించాడు.

ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇషాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని నెలలుగా తాను చాలా నిరుత్సాహంగా ఉన్నానని, అంతా సవ్యంగానే ఉందని తాను భావించడం లేదని వ్యాఖ్యానించాడు. పరిస్థితిని అనుభవించడం అంత సులభం కాదని అన్నాడు.

- Advertisement -

ఏం జరిగింది?, తన విషయంలో మాత్రమే ఎందుకు ఇలా జరిగింది? వంటి ప్రశ్నలు తన మెదడులో తిరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నాడు. తాను చక్కగా ఆడుతున్న సమయంలో ఇవన్నీ జరిగాయని వాపోయాడు. కాగా తిరిగి టీమిండియాలో అడుగు పెట్టాలని యోచిస్తున్న ఇషాన్ కిషన్ ఈ సీజన్‌ దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్‌కు ఆడాలని నిర్ణయించుకున్నాడు.

కాగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వైదొలగిన ఇషాన్ కిషన్ స్వదేశానికి వచ్చి రంజీ ట్రోఫీ ఆడలేదు. అయితే ఇదే సమయంలో హార్దిక్ పాండ్యాతో కలిసి 2024 ఐపీఎల్‌కు సన్నద్దమయ్యాడు. బీసీసీఐ ఆగ్రహానికి ఇదే కారణమైందన్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement