జింబాబ్వే పర్యటనకు ఎంపికైన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బిగ్ షాకిచ్చింది. అతన్ని ఈ పర్యటన నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. అతని స్థానాన్ని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేతో భర్తీ చేసింది. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
‘అజిత్ అగార్కర్ సారథ్యంలోని పురుషుల సెలెక్షన్ కమిటీ గాయపడిన నితీష్ రెడ్డి స్థానాన్ని శివమ్ దూబేతో భర్తీ చేసింది. నితీష్ కుమర్ రెడ్డి గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది.’అని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ట్రైనింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి గాయపడ్డారు.
అయితే అతని గాయంపై ఎలాంటి స్పష్టత లేదు. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన కుర్రాళ్లను ఎన్‌సీఏకు రప్పించిన బీసీసీఐ వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తోంది. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డి గాయపడ్డాడు. జూలై 4 నుంచి ప్రారంభమయ్యే జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సంచలన ప్రదర్శన కనబర్చిన నితీష్ కుమార్ రెడ్డికి కూడా అవకాశం కల్పించింది. దాంతో నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే అతన్ని దురదృష్టం వెంటాడింది.
జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టు(అప్‌డేటేడ్):
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(కీపర్), ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే.