టీ20 వరల్డ్ కప్‌లో భాగాంగా నేడు ట్రిండాడ్ వేదికగా ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్ నామమాత్రపు మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటింది. మొదట బంతితో, తర్వాత బ్యాటుతో చెలరేగి ఉగాండపై రికార్డు గెలుపు నమోదుచేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఉగాండ 18.4 ఓవర్లలో 40 పరుగులకు ఆలౌటైంది. కెన్నెత్ వైస్వా (11) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సౌథి (3/4) మూడు, బౌల్ట్ (2/7) శాంట్నర్ (2/8), రచిన్ రవీంద్ర (2/9) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఉగాండను బౌల్ట్ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు.
అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (9) నిదానంగా ఆడాడు. రియాజత్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అచెలమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (22 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టును పవర్‌ప్లేలోపే గెలిపించాడు.