న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఇవాళ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 47 ఓట్లలో సంజయ్ సింగ్‌కు 40 ఓట్లు పోలయ్యాయి. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపించిన కేసులో ఆయన సమాఖ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో అనితా షీరాన్ ఓటమి పాలయ్యారు. కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన అనితాకు టాప్ రెజ్లర్లు మద్దతు ఇచ్చారు. కానీ సమాఖ్య ఎన్నికల్లో మాత్రం బ్రిజ్ వర్గానికే పెద్ద పీట దక్కింది.
కాగా, ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా సంజయ్ సింగ్ గతంలో పనిచేశారు. 2019 నుంచి డబ్ల్యూఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సంయుక్త కార్యదర్శిగా చేశారు. ఇక ఇదే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ ఫోస్టు కోసం రేసులో ఉన్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఓటమి పాలయ్యారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీ జనరల్, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోస్ట్ లు సైతం బ్రిజ్ సన్నిహితులే గెలుపొందారు..