జకర్తా: ఇండోనేసియాతో గురువారంనాడు జకర్తాలోని జీబీకే స్పోర్ట్స్ కాంప్లెక్స్ హాకీ మైదానంలో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ జైత్రయాత్ర సాగించింది. ఆసియా కప్ హాకీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత హాకీ జట్టు జూలు విదిల్చింది. పూల్-ఏలో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఏకంగా 16-0తో గెలుపొంది, భారత జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. టీమిండియా తరపున డిస్పన్ టిర్కీ 4 గోల్స్ కొట్టగా.. సుదేవ్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. సెల్వం, పవన్, వెటరన్ ఆటగాడు ఎస్వీ సునీల్‌లు కీలక సమయాల్లో గోల్స్‌తో మెరిసి భారత్‌కు విజయం అందించారు. ఇక పురుషుల ఆసియా హాకీ కప్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.
ఇండోనేషియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఓపెనింగ్ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ను 2-5తో పరాజయంపాలై సూపర్-4 అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఇండోనేషియాతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో 15 గోల్స్ కొడితే గాని భారత్‌కు సూపర్-4కు అర్హత సాధించే అవకాశం ఉండేది. అదే సమయంలో జపాన్ చేతిలో పాకిస్తాన్ కూడా ఓటమి పాలవ్వాలి. ఇక్కడే మనకు అదృష్టం కలిసొచ్చింది. జపాన్ చేతిలో పాకిస్తాన్ ఓటమి చెందడం.. ఇండోనేషియాతో మ్యాచ్‌లో అనుకున్న దానికంటే ఒక గోల్ ఎక్కువే కొట్టిన టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుకొని సూపర్-4లో అడుగుపెట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..