ఐపీఎల్ 17వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతోంది. రీ ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ బాగానే ఆడుతున్నప్పటికి అతడి సారథ్యంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడిన ఢిల్లీ నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌లో గెలిచింది. రెండు పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి.
పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నప్పటికీ బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫలం అవుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ లిజాడ్ విలిమయ్స్‌ను తీసుకుంది. అతడి బేస్‌ప్రైజ్ అయిన రూ.50లక్షలకే అతడిని సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపిఎల్ ) 2024లో మిగిలిన మ్యాచ్‌లకు ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ స్థానంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లిజాడ్ విలియమ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది.’ అని ఐపీఎల్ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.