Saturday, November 23, 2024

SA vs NEP | నేపాల్ మ్యాచ్ లో చావు త‌ప్పి….

టీ20 ప్రపంచకప్‌-2024 లీగ్‌ మ్యాచ్‌లో నేపాల్‌ జట్టు సౌతాఫ్రికాకు చెమటలు పట్టించింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపి.. చివరికి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే.. నువ్వా-నేనా అన్నట్లుగా పటిష్ట ప్రొటిస్‌ జట్టుతో విజయం కోసం నేపాల్‌ జట్టు పోరాడిన తీరు మాత్రం అభిమానుల మనసు గెలుచుకుంది.

సెయింట్‌ విన్సెంట్‌ వేదికగా శనివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నేపాల్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. స్పిన్నర్‌ కుశాల్‌ భూర్తేల్‌(4/19), పేసర్‌ దీపేంద్ర సింగ్‌(3/21) సంచలన ప్రదర్శన కనబరిచారు. అద్భుత స్పెల్స్‌తో సౌతాఫ్రికాను 115 పరుగులకు కట్టడి చేశారు. ప్రొటిస్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌(43) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌(18 బంతుల్లో 27 నాటౌట్‌) రాణించాడు.

స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన నేపాల్ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించింది. 8వ ఓవర్‌లో సఫారీ బౌలర్‌ షంసీ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి ఆ జట్టును దెబ్బకొట్టాడు. ఆ తర్వాత నేపాల్‌ పటిష్టస్థితిలోనే ఉండి విజయానికి చేరువైనట్లే కన్పించింది. అప్పుడు మళ్లీ బంతి అందుకున్న షంసీ.. 18వ ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.

చివరి ఓవర్‌లో 8 పరుగులు అవసరం కాగా మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. తీవ్ర ఒత్తిడిలోనూ దక్షిణాఫ్రికా బౌలర్‌ బార్ట్‌మన్‌ నేపాల్‌ బ్యాటర్లను కట్టడి చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. గుల్సాన్‌ ఝాను ఔట్‌ చేశాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ గెలిస్తే సూపర్‌-8 రేసులో నిలబడేది. ఓటమి పాలవడంతో టోర్నీ నుంచి తిరుగుముఖం పట్టింది. సఫారీ బౌలర్‌ షంసీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

- Advertisement -

కాగా, వరల్డ్‌కప్‌-2024 లీగ్‌ దశలో బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌, శ్రీలంకతో కలిసి గ్రూప్‌-డిలో ఉన్న సౌతాఫ్రికా ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌-8కు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement