న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫిట్‌నెస్, స్పోర్ట్స్ కోచ్ అవతారమెత్తాడు. పాఠశాల విద్యార్థులకు క్రీడలు, శారీరక దారుఢ్యంపై అవగాహన కలిపించాడు. నీరజ్ ప్రయత్నంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి గోల్డెన్ బాయ్‌ను ప్రశంసించారు. 2024 పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా ఏర్పాటు చేసిన మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వ్యాయామం, క్రీడలపై మరింత ఆసక్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రఖ్యాత క్రీడాకారులు దేశంలోని పాఠశాలలను సందర్శిస్తారు. క్రీడల ప్రాముఖ్యత, సమతుల్య ఆహారం, ఫిట్‌నెస్‌పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఒలింపియన్‌లతోపాటు పారాలింపియన్‌లు కూడా యువతను క్రీడలపట్ల ప్రోత్సహించేందుకు కృషి చేస్తారు.
అహ్మదాబాద్‌లోని సంస్కార్థామ్ స్కూల్ వేదికగా జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన నీరజ్ విద్యార్థులుకు పౌష్టికాహారం, శారీరక దారుఢ్యం, క్రీడలపై విద్యార్థులకు అవగాహన కల్పించాడు. ఈ కార్యక్రమంలో 75మంది వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులతో మమేకమైన నీరజ్ వారికి జావెలిన్ త్రో క్రీడకు సంబంధించి కొన్ని విలువైన సలహాలు, సూచనలు తెలియజేశాడు. దీనిపై మరుసటిరోజు టిటర్ వేదికగా స్పందించిన ప్రధాని మోడీ యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించే ప్రయత్నాన్ని ప్రశంసించారు. నీరజ్ చోప్రా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాడు. దీంతో యువతకు క్రీడలపై ఆసక్తి కలిగి మెరుగైన ప్రదర్శన చేసేందుకు నీరజ్ చేపట్టిన కార్యక్రమం దోహదపడుతుందని టీట్‌లో మోడీ పేర్కొన్నారు.
కాగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యా మంత్రితశాఖ, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా నీరజ్ చోప్రా టిటర్ వేదికగా మాట్లాడుతూ విద్యార్థులతో మమేకమై వారితో క్రీడలు, ఫిట్‌నెస్, వ్యాయామం, ఆహారం ప్రాముఖ్యత గురించి మాట్లాడటం తనకు ఓ అద్భుతమైన రోజుగా పేర్కొన్నాడు. క్రీడలు, విద్యావేత్తల సమతుల్యతను అందించే పాఠశాలను సందర్శించడం చాలా ఆనందంగా ఉందని చోప్రా ట్వీట్ చేశాడు. కాగా ఎంఓసీకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మిషన్ ఒలింపిక్ సెల్‌లో బైచుంగ్ భూటియా, అంజు బాబి జార్జ్, అంజలి భగవత్, తృప్తి ముర్గుండే, సర్దారా సింగ్, వీరేన్ రస్కిన్హా, మాలావ్ ష్రాఫ్, మోనాలిసా మెహతతోపాటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, రెస్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఉంటారు.