Friday, September 20, 2024

Olympics | ఈరోజు న‌దీమ్ దే : నీర‌జ్ చోప్రా

భారతదేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉందని బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా తెలిపాడు. జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో చాలా పోటీ ఉందని, ప్రతి అథ్లెట్‌ తనదైన రోజున సత్తా చాటుతాడన్నాడు. ఇది అర్షద్‌ నదీమ్‌ డే అని, తాను మాత్రం వందశాతం కష్టపడ్డా అని నీరజ్‌ చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్‌ 2024 జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో నీరజ్‌ చోప్రా (89.45 మీటర్లు) సిల్వర్‌ మెడల్‌ను సాధించాడు.

ఫైనల్‌లో పాకిస్థాన్‌ జావెలిన్‌ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్‌ (92.97 మీటర్లు) స్వర్ణం సాధించాడు. నీరజ్‌ చోప్రా మాట్లాడుతూ… ”దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అయితే, నా ప్రదర్శనను ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉంది. తప్పకుండా దీనిపై మేం కూర్చొని మాట్లాడుకుంటాం. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు చాలా అద్భుత ప్రదర్శన చేశారు.

జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో చాలా పోటీ ఉంది. ప్రతి అథ్లెట్‌ తనదైన రోజున సత్తా చాటుతాడు. ఇది అర్షద్‌ డే. నేను మాత్రం వందశాతం కష్టపడ్డా. కానీ, మరికొన్ని అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. మన జాతీయ గీతం వినిపించలేకపోయినందుకు బాధగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మరోసారి సాధిస్తాననే నమ్మకం ఉంది” అని నీరజ్ వ్యాఖ్యానించాడు.

గర్వంగా ఉంది : నీరజ్‌ తండ్రి సతీశ్

నీరజ్‌ తండ్రి సతీశ్‌ స్పందిస్తూ.. ”దేశం కోసం సిల్వర్‌ గెలిచాడు. మేమంతా సంతోషంగా ఉన్నాం. గర్వంగా భావిస్తున్నాం. అతడు యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. గాయం తీవ్రత కూడా అతడి ప్రదర్శనపై కాస్త ప్రభావం చూపించి ఉండొచ్చు. లేకపోతే ఇంకా మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉండేది” అని తెలిపారు.

- Advertisement -

అతడికిష్టమైన ఆహారం వండి పెడతా: నీరజ్ తల్లి

”నా కుమారుడు రజత పతకం సాధించడం ఆనందంగా ఉంది. గోల్డ్‌ మెడల్‌ కంటే కూడా ఎంతో విలువైంది. బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు కూడా కుమారుడిలాంటివాడే. నీరజ్‌ ప్రదర్శనపట్ల గర్వంగా ఉంది. ఇక్కడికి వచ్చాక.. అతడికి ఇష్టమైన ఆహారాన్ని వండిపెడతా” అని నీరజ్‌ తల్లి సరోజ్‌ దేవి వెల్లడించారు. తన మనవడు రజత పతకం సాధించడంపై నీరజ్‌ తాత ధరమ్‌ సింగ్‌ చోప్రా ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement