పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్‌తో మెరిసిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరచ్ చోప్రా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న లుసానే డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగుతున్నాడు. అయితే పారిస్ ఒలింపిక్స్ తర్వాత నీరజ్ తన గాయానికి శాస్త్రచికిత్స చేయించుకోనున్నాడని వస్తున్న వార్తలను అతడు తోసిపుచ్చాడు.
ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానున్న లుసానే డైమండ్ లీగ్‌లో పాల్గొంటున్నానని నీరజ్ చోప్రా శనివారం వెల్లడించాడు. కాగా, డైమండ్ లీగ్ ఫైనల్ పోటీలు సెప్టెంబర్ 14న బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరుగుతాయి. ఈ సీజన్‌లో నీరజ్ దోహా డైమండ్ లీగ్‌లో మాత్రమే ఆడాడు.
ఆ పోటీలో నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ మెగా లీగ్‌లో నీరజ్ ఏడు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి ఆరు స్థానాల్లో నిలిచే ప్లేయర్లు డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఇక ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా 89.54 మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచి రతజ పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 92.97 మీటర్లతో ఒలింపిక్ రికార్డు నెలకొల్పి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. తాజాగా పారిస్‌లో తన ప్రదర్శనపై నీరజ్ స్పందించాడు. పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్‌తో నాకు మంచి పోటీ ఎదురైంది. అతడు ఆటలో ఎంతో శ్రమిస్తాడు.
అతడిలో ఎంతో నైపుణ్యం ఉంది. ఈసారి ఒలింపిక్స్‌లో రెండో ప్రయత్నంలోనే నదీమ్ రికార్డు స్థాయిలో బల్లెంను విసిరి పోటీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత నేను కూడా రెండో ప్రయత్నంలో ఈటను బలంగా విసిరాను కానీ నా శరీరం సహకరించక పోవడంతో నదీమ్ రికార్డును బ్రేక్ చేయలేక రెండో స్థానంలో నిలిచాను. ఇప్పుడు డైమండ్ లీగ్‌లో నదీమ్‌తో మళ్లిd పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నానని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు.