Friday, November 22, 2024

Sunil Narine : న‌రైన్ మా కొంప ముంచాడు…

కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.

- Advertisement -

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. పవర్ ప్లేలో దూకుడుగా ఆడకపోవడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ వికెట్ చాలా క్రేజీగా అనిపించింది. రూల్స్ రూల్సే. నేను, కోహ్లీ.. ఆ బంతి నడుము కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని భావించాం. కానీ ఇతరులు అలా అనుకోలేదు.

అంపైర్లు కూడా బంతి హైట్‌ను విభిన్నంగా కొలిచారు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన తర్వాత రజత్ పటీదార్-విల్ జాక్స్ అద్భుత భాగస్వామ్యాన్ని అందించారు. కానీ నరైన్ ఓవర్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ సీజన్‌లో కూల్‌గా ఆడుతూ క్రీజులో సెట్ అయ్యే సమయం లభించడం లేదు. ఎక్స్‌ట్రా బ్యాటర్ అందుబాటులో ఉన్నప్పుడు ఛేజింగ్ పెద్ద కష్టం కాదు. కానీ సునీల్ నరైన్ సూపర్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

అయితే ఈ రోజు మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. మేం బౌలింగ్, ఫీల్డింగ్ చేసిన విధానం కూడా బాగుంది. అయితే డెత్ ఓవర్లలో మేం ఎక్కువ పరుగులు ఇచ్చాం. అయినా ఛేదించదగిన లక్ష్యమేనని భావించాం. పవర్ ప్లేలో కాస్త ధాటిగా ఆడాల్సింది. కొన్ని బౌండరీలు రాబట్టాల్సింది. మా పోరాటానికి పదికి పది మార్కులు ఇస్తాను. మాకు అసాధారణమైన అభిమాన గణం ఉంది. వారిని సంతోషపరిచేందుకు సాయశక్తులా కృషి చేస్తాం. ప్రస్తుత పరిస్థితులను మార్చేందుకు తీవ్రంగా పోరాడుతాం.’అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement