Friday, November 22, 2024

ఒకే ఒక్కడు నాదల్‌.! ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేతగా స్పెయిన్‌బుల్‌..

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2022 విజేతగా అవతరించిన స్పెయిన్‌ బుల్‌ నాదల్‌ ప్రపంచ టెన్నిస్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. సెర్బియా టెన్నిస్‌ స్టార్‌, ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌, స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ 20గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును బ్రేక్‌ చేసిన రఫెల్‌ నాదల్‌ 21వ గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకుని… ఆల్‌టైమ్‌ రికార్డు తనపేరిట నమోదు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలవడం నాదల్‌కు ఇది రెండోసారి..ఇంతకుముందు 2009లో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. అనంతరం 13ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి విజేతగా నిలిచి టెన్నిస్‌ లోకంలో కొత్త శకాన్ని సృష్టించాడు. స్పెయిన్‌ బుల్‌ దూకుడు ధాటికి రెండోసీడ్‌ రష్యాకు చెందిన మెదెదెవ్‌ పోరాడినా నిలువలేక ఓటమిపాలయ్యాడు. సుమారు ఐదున్నర గంటలపాటు జరిగిన హోరాహోరీ పోరులో నాదల్‌ మెదెదెవ్‌పై 2-6, 6-7(5), 6-4, 6-4, 7-5తేడాతో గెలుపొంది విజయపతాకం ఎగురేశాడు.తొలి రెండు సెట్లను కోల్పోయిన నాదల్‌ ఆఖరి మూడుసెట్లలో అనితరసాధ్య పోరాటంతో విజయం సాధించి టైటిల్‌ విన్నర్‌గా నిలిచాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో.. స్పానిష్‌ లెజెండ్‌ రఫెల్‌ నాదల్‌ రష్యా స్టార్‌ మెదెదెవ్‌ ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో హోరాహోరీగా తలపడ్డారు. తొలి సెట్‌ను దూకుడుగా ఆడి 6-2తేడాతో 42నిమిషాల్లో గెలుచుకున్న మెదెదెవ్‌ అదేజోరుతో నాదల్‌ పోరాటాన్ని అడ్డుకుని 6-7తో రెండోసెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆరోసీడ్‌ నాదల్‌ తొలిరెండు సెట్లను 6-2, 7-6 (7/5) తేడాతో కోల్పోయినా అదితియ పోరాటంతో రెండో సీడ్‌ మెదెదెవ్‌పై 6-4తో మూడోసెట్‌ను గెలుచుకుని టైటిల్‌ రేసులో నిలిచాడు.

మొదటిసెట్‌ను 6-2తో మెదెదెవ్‌ కైవసం చేసుకున్న తరాత టైబ్రేక్‌కు ముందు ఇరువురు 84నిమిషాలపాటు తీవ్రంగా తలపడినా రెండో సెట్‌ను మెదెదేవ్‌ కైవసం చేసుకున్నాడు. తొలి రెండు సెట్‌లు గెలిచి ఆధిక్యంలో దూసుకుపోతున్న రష్యాస్టార్‌ను స్పెయిన్‌ బుల్‌ తగ్గేదేలా అన్నట్లు అడ్డుకున్నాడు. మూడో సెట్‌ను 6-4తో గెలుచుకున్న నాదల్‌ టైటిల్‌ రేసులో నిలిచాడు. ఈక్రమంలో నాలుగోసెట్‌ను కూడా నాదల్‌ 6-4తో గెలుచుకోవడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. తన వ్యూహాలను మార్చుకున్న స్పానిష్‌ స్టార్‌ వరుసగా రెండు సెట్లును సొంతం చేసుకుని రెండో సీడ్‌ మెదెదెవ్‌కు సవాల్‌గా నిలిచాడు. ఇద్దరూ చెరో రెండు సెట్లు గెలుచుకోవడంతో మ్యాచ్‌ నిర్ణయాత్మక ఐదోసెట్‌కు వెళ్లింది.

నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు.. రెండుసార్లు గెలుచుకున్న నాదల్‌..

ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో విజేతగా నిలిచి 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకున్న 35ఏళ్ల నాదల్‌.. ఈక్రమంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. స్పెయిన్‌కు చెందిన నాదల్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదోస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేతగా నిలిచి 125,050,235 డాలర్ల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. కెరీర్లో 89టైటిళ్లను గెలుచుకున్న స్పెయిన్‌ దిగ్గజం 21గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేతగా 2009, 2022లో నిలిచాడు. ఫ్రెంచ్‌ఓపెన్‌ టైటిల్‌ను 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020లో కైవసం చేసుకున్నాడు. 2008, 2010లో వింబుల్డన్‌ విజేతగా అవతరించాడు.యూఎస్‌ ఓపెన్‌ ట్రోఫీని 2010, 2013, 2017, 2019లో ముద్దాడాడు. కాగా రికార్డుస్థాయిలో వరుసగా 849 వారాలపాటు 2005 నుంచి 2021వరకు టాప్‌-10 ర్యాంక్‌లో కొనసాగాడు. ఈక్రమంలో 209వారాలపాటు నంబర్‌వన్‌గా, 160 వారాలపాటు నంబర్‌ టూ ర్యాంక్‌ ఆటగాడిగా నిలిచాడు. 1970 నుంచి నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలను రెండుసార్లు గెలుచుకున్న ఆటగాడిగా జకోవిచ్‌ తర్వాత రెండో ఆటగాడిగా నాదల్‌ నిలిచాడు.

నాదల్‌ 21వ గ్రాండ్‌స్లామ్, గెలుపు ప్రస్థానం..

- Advertisement -

చాలాకాలంగా పాదాల గాయంతో బాధపడుతున్న రఫెల్‌ నాదల్‌ 2021 సీజన్‌కు దూరమయ్యాడు. అనంతరం గత డిసెంబర్‌లో కరోనా బారినపడి కోలుకున్నాడు. ఈ సీజన్‌లో 11మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచే క్రమంలో తొలి రౌండులో అమెరికాకు చెందిన మార్కోస్‌పై 6-1, 6-4, 6-2తో గెలిచాడు. రెండో రౌండులో జర్మనీకి చెందిన యానిక్‌ గిరోన్‌ను 6-2, 6-3, 6-4తో, మూడో రౌండులో రష్యాకు చెందిన ఖచనోవ్‌ను 6-3, 6-2, 3-6, 6-1తో ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. నాలుగో రౌండులో ఫ్రాన్స్‌కు చెందిన అడ్రియన్‌పై 7-6 (16/14), 6-2, 6-2తో గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు నాదల్‌ చేరుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్లో కెనడాకు చెందిన డెనిస్‌ షపోవలోవ్‌పై 6-3, 6-4, 4-6, 3-6, 6-3తేడాతో అద్భుత విజయం సాధించి సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నాడు. సెమీఫైనల్లో ఇటలీకి చెందిన బెరెటినిపై 6-3, 6-2, 3-6, 6-3తేడాతో గెలిచి తుదిపోరుకు చేరుకున్నాడు. టైటిల్‌పోరులో రష్యాకు చెందిన మెద్వెదెవ్‌పై 2-6, 6-7 (5/7), 6-4, 7-5తేడాతో గెలిచి 21గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement