పారిస్ ఒలింపిక్స్‌లో ఏడు నెలల గర్భంతో పోటీ పడ్డానని ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్ చెప్పింది. ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీపై ఓపెనింగ్ మ్యాచ్‌లో 15-13 స్కోరుతో విజయం సాధించింది. అయితే.. హఫీజ్ తర్వాత రౌండ్ ఆఫ్ 16లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయోంగ్ చేతిలో 15-7 తేడాతో ఓడిపోయింది. కానీ బలమైన పోటీ ఇచ్చింది.
ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా..
హఫీజ్ తన విజయాలు.. ఎదుర్కొన్న సవాళ్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ‘పోడియంపై మీకు ఇద్దరు ఆటగాళ్లు కనిపిస్తున్నారు. వాస్తవానికి వారు ముగ్గురు! అది నేను, నా ప్రత్యర్థి, ఇంకా మా ప్రపంచంలోకి రాబోయే, నా లిటిల్ బేబీ! నా బిడ్డ, నేను ఫిజికల్, ఎమోషనల్ చాలెంజెస్‌ను కలిసి ఎదుర్కొన్నాం.’ అని తెలిపింది.
సులువుగా లొంగిపోలేదు!
గర్భంతో ఉన్నప్పుడు మహిళలు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతారు. అలాంటిది తీవ్ర పోటీ ఉండే ఒలింపిక్స్‌లో పాల్గొనడం అసాధారణం. హఫీజ్ ఫెన్సింగ్‌పై చూపిన డెడికేషన్, ప్యాషన్‌కు గ్లోబల్ అథ్లెటిక్ కమ్యూనిటీ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ‘గర్భంతో ఉన్నప్పుడు సాధారణంగా కొన్ని సవాళ్లు ఉంటాయి. కానీ, జీవితాన్ని, క్రీడలను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించడం మరింత సవాలుగా మారింది. అయితే, అదంతా విలువైనదే. 16వ రౌండ్‌లో చోటు సంపాదించినందుకు చాలా గర్వంగా ఉంది’ అని హఫీజ్ తెలిపింది.
ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం అదృష్టం..
పారిస్ ఒలింపిక్స్‌లో తన స్ఫూర్తిదాయక ప్రయాణంలో తన భర్త అందించిన సపోర్ట్ గురించి హఫీజ్ ప్రస్తావించింది. ‘ఇంత దూరం రావడానికి నా భర్త, నా కుటుంబం సపోర్ట్ లభించినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. ఈ ఒలింపిక్స్ నాకు భిన్నంగా ఉంది. ఇది నాకు మూడో ఒలింపిక్స్. కానీ ఈసారి నేను ఒక చిన్న ఒలింపియన్‌ను కూడా తీసుకువెళ్లాను!’ అని పేర్కొంది. కాగా, హఫీజ్ గతంలో 2016 రియో ఒలింపిక్స్, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో ఈజిప్ట్‌కు ప్రాతినిధ్యం వహించింది.