వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ముంబై విజయం దిశగా దూసుకెళ్తోంది. ముషీర్ ఖాన్ (136; 326 బంతుల్లో 10×4), శ్రేయస్ అయ్యర్ (95; 111 బంతుల్లో, 10×4, 3×6), అజింక్య రహానె (73; 143 బంతుల్లో, 5×4, 1×6) సత్తాచాటడంతో విదర్భకు ముంబై 538 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదన మొదలుపెట్టిన విదర్భ పోరాడుతోంది. 20 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.
అయితే సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ అరుదైర ఘనత సాధించాడు. ముంబై తరఫున రంజీ ఫైనల్లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. ముషీర్ 19 ఏళ్ల 14 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది.
1995లో పంజాబ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సచిన్ సెంచరీ బాదాడు. 21 ఏళ్ల వయస్సులో మూడంకెల స్కోరు అందుకున్నాడు. 29 ఏళ్ల తర్వాత సచిన్ రికార్డును ముషీర్ బ్రేక్ చేశాడు. అయితే సచిన్ కళ్ల ఎదుటే ఈ రికార్డు బ్రేక్ అవ్వడం విశేషం.
ఈ విషయంపై ముషీర్ ఖాన్ మాట్లాడాడు. సచిన్ వచ్చినట్లు తొలుత తనకి తెలియదని పేర్కొన్నాడు. ”సచిన్ సర్ వచ్చినట్లు నాకు తెలియదు. 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు బిగ్ స్క్రీన్‌పై సచిన్‌ను చూశాను. ఆ తర్వాత ఆయన్ని చూసి ప్రేరణ పొందాను. ఇవాళ నా ఆటతో సచిన్‌ను ఆకట్టుకోవాలని బ్యాటింగ్ చేశాను. టీమిండియా టెస్టు క్రికెటర్లు అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడటాన్ని గర్విస్తున్నాను. అయితే విదర్భ జట్టులో ప్రతిఒక్కరు రహానెను ఔట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో నేను పరుగులు సాధించడానికి సులభం అయ్యింది” అని ముషీర్ ఖాన్ తెలిపాడు.