Sunday, November 17, 2024

IPL : నేడు స‌న్ తో ముంబై ఢీ… టార్గెట్ 300

దారుణమైన ఆటతీరుతో ప్లే ఆఫ్ ఆశలను నాశనం చేసుకున్న ముంబై జట్టు.. హైదరాబాద్ జట్టుతో సోమవారం సొంత మైదానంలో తలపడనుంది. ఇప్పటికే 11 మ్యాచ్ లు ఆడి, మూడింట్లో మాత్రమే గెలిచిన ముంబై.. ప్లే ఆఫ్ నుంచి అనధికారికంగా ఎప్పుడో వెనుతిరిగింది. ముంబై మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిల్లో వరుసగా గెలిచినా ప్లే ఆఫ్ వెళ్లే పరిస్థితి లేదు.

- Advertisement -

ఇక ఈ టోర్నీలో హైదరాబాద్ ఇప్పటివరకు పది మ్యాచ్లలో ఆరింట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ దశలో ముంబై జట్టును ఓడించి, ప్లే ఆఫ్ ఆశలను మరింత సుస్థిరం చేసుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న హైదరాబాద్ టీమ్ 300 పరుగుల స్కోర్ పై కన్నేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసిన్, నితీశ్ కుమార్ రెడ్డి, భీకర ఫామ్ లో ఉండటంతో ఎస్ఆర్హెచ్ కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.

ఈ క్రమంలో సోమవారం జరిగే ఈ మ్యాచ్ పై అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్లో గెలిచి కనీసం పరువైనా కాపాడుకోవాలని ముంబై జట్టు తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగానే జట్టులో చాలా మార్పులు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న రోహిత్ శర్మను హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ కు దూరంగా ఉంచినట్టు తెలుస్తోంది. కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానంలోకి దిగాడు.. తక్కువ స్కోర్ చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.

టి20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో అతడికి విశ్రాంతి ఇచ్చారని ముంబై ఆటగాడు పీయూష్ చావ్లా పేర్కొన్నాడు. రోహిత్ మాత్రమే కాదు, జస్ ప్రీత్ బుమ్రా కు విశ్రాంతి ఇచ్చారు. రోహిత్ దూరంగా ఉంటే.. ముంబై జట్టు ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. బుమ్రా స్థానంలో ఆకాష్ ఆడతాడని తెలుస్తోంది. నమన్ ధీర్ కూడా ఆడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నేహల్ వదేరా, టిమ్ డేవిడ్ మిడిల్ ఆర్డర్లో ఆడతారు. కోయిట్జీ, పీయూష్ చావ్లా, నువాన్ తుషారా బౌలింగ్ వేస్తారు.

ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్ బెర్త్‌ల కోసం అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లకు ప్లేఆఫ్ ఆశలు పూర్తిగా కొల్పోయే పరిస్థితికి చేరుకున్నాయి. ఎక్కువ ఓటములు చెంది పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్లకు ప్లేఆఫ్ లో చోటు దక్కే ఛాన్స్ దాదాపుగా లేనట్లే అనుకోవాలి. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ లాంటి టీమ్స్ ఉన్నాయి. ఇవి ఎంత పోరాడినా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఈ జట్లు ప్లే ఆఫ్ ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని చెప్పుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement