ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వాంఖడే వేదికగా రేపు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. దాదాపు 20 రోజుల తర్వాత ముంబై తిరిగి సొంత మైదానంలో మ్యాచ్ ఆడనుంది.హ్యాట్రిక్ ఓటమల తర్వాత ఆలస్యంగా గెలుపు బాట పట్టిన హార్దిక్‌సేన తిరిగి వరుసగా పరాజయాల్ని చవిచూస్తోంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.
తదుపరి దశకు చేరాలంటే ముంబై ఇండియన్స్ తప్పక విజయం సాధించాల్సిందే. దీంతో రేపు జరగనున్న పోరులో ప్రత్యేక వ్యూహాలతో కేకేఆర్‌ను మట్టికరిపించాలని ముంబై భావిస్తోంది. అయితే పది మ్యాచ్‌లు ఆడి మూడింట్లో నెగ్గి తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉన్న కోల్‌కతాను ఓడించడం అంత సులువైన విషయం కాదు.
ఈ నేపథ్యంలో జట్టు కూర్పు గురించి కెప్టెన్ హార్దిక్ పాండ్య, ముంబై జట్టు యాజమాన్యం తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కాబట్టి కొయొట్జిపై వేటు వేసి ఆల్‌రౌండర్ షెఫార్డ్ను జట్టులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. షెఫార్డ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు బంతితోనూ అలరించగలడు. నువాన్ తుషారాను జట్టులోని కొనసాగించాలని యోచిస్తున్నారు. లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లో తుషారా ఆకట్టుకున్నాడు.
జట్టులో మిగిలిన సభ్యులను యథావిధంగా కొనసాగించాలనుకుంటున్నారు. అయితే ఆటగాళ్ల ఫామ్ ముంబైను ఇబ్బంది పెడుతోంది. బుమ్రా మినహా స్టార్ ప్లేయర్లు ఎవరూ అంచనాలను అందుకోలేకపోతున్నారు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్, టిమ్ డేవిడ్ నిలకడగా పరుగులు సాధించలేకపోతున్నారు. తిలక్ వర్మ అప్పుడప్పుడు మెరుస్తున్నప్పటికీ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఈ ఆటగాళ్లంతా కేకేఆర్ మ్యాచ్‌లో అయినా తిరిగి ఫామ్‌లో అందుకుంటారని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.
కాగా, ఐపీఎల్ హిస్టరీలో కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్‌దే పైచేయి. ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడాయి. దీనిలో ముంబై 23 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కోల్‌కతా తొమ్మిదింట్లోనే నెగ్గింది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, నెహాల్ వదేరా/ఆకాశ్ మద్వాల్, మహ్మద్ నబీ, షెఫార్డ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.