Tuesday, November 26, 2024

Ranji 2024 | రంజీ ఫైనల్లో ముంబై !

రంజీ ట్రోఫీ-2024లో ముంబై జట్టు ఫైనల్లో దూసుకెళ్లింది. దేశవాళీ ప్రముఖ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీలో ముంబై తన తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ రికార్డు స్థాయిలో 48వ సారి తుది పోరుకు అర్హత సాధించింది. కాగా అందులో ఏకంగా 41 సార్లు ట్రోఫీని సొంతం చేసుకొని ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇక ముంబై వేదికగా జరిగిన సెమీ ఫైనల్స్‌లో అజింక్యా రహానే సారథ్యంలోని ముంబై జట్టు తమిళనాడుపై ఇన్నింగ్స్‌ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న ముంబై స్టార్‌ ప్లేయర్‌ శార్దుల్‌ ఠాకుర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ముందు అద్భుత శతకం చేసిన శార్దుల్‌ (109; 105 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) తర్వాత బౌలింగ్‌లోనూ జత్తా చాటుకొని రెండు ఇన్నింగ్స్‌లో మొత్తం 4 వికెట్లు పడగొట్టి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు ప్రత్యర్థి బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. తుషార్‌ పాండే 3 వికెట్లతో విజృంభించగా.. శార్దుల్‌ ఠాకుర్‌, ముషీర్‌ ఖాన్‌, తనుష్‌ కోటీయన్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. తమిళనాడు బ్యాటర్లలో విజయ్‌ శంకర్‌ (44), వాషింగ్టన్‌ సుందర్‌ (43) రాణించినా మిగతా బ్యాటర్లు తేలిపోయారు. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన ముంబైకు కూడా తమిళ బౌలర్లు హడలెత్తించారు. ఒకానొక దశలో రహానే సేన కూడా 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇలాంటి సమయంలో 9వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ముంబైను ఆదుకున్నాడు. హార్దిక్‌ తమోర్‌ (35)తో కలిసి 8వ వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అనంతరం తనుష్‌ కోటీయన్‌తో కలిసి 9వ వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పర్చాడు. ఈ క్రమంలోనే 90 బంతుల్లోనే శార్దుల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తన తొలి సెంచరీ సాధించాడు. అనంతరం 109 స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన చివరి బ్యాటర్‌ తుషార్‌ దేశ్‌ పాండే (26)తో కలిసి తనుష్‌ 88 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కోటీయన్‌ 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ముంబైకు 232 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తమిళనాడు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంలో మరోసారి విఫలమై 162 పరుగులకే చాపచుట్టేసుకుంది. దాంతో లీగ్‌ దశతో పాటు క్వార్టర్‌ ఫైనల్స్‌లో అదరగొట్టిన తమిళనాడు సెమీస్‌లో మాత్రం ఇన్నింగ్స్‌ 70 పరుగులతో చిత్తాయింది. ముంబై మాత్రం దర్జాగా 48వ సారి రంజీ ఫైనల్లో ప్రవేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement