Sunday, November 24, 2024

BCCI : టీమ్ ఇండియా కోచ్ కోసం మోదీ, అమిత్ షా ద‌ర‌ఖాస్తులు

టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్‌ 2024తో ముగియనుంది. మరోసారి కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్ సముఖంగా లేదు. దాంతో హెడ్ కోచ్‌ పదవి కోసం బీసీసీఐ ఈ నెల ఆరంభంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఆఖరి గడువు (మే 27) ముగిసింది. హెడ్ కోచ్‌ పదవి కోసం ఏకంగా 3వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భారీ సంఖ్యలో నకిలీ దరఖాస్తులు ఉన్నాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, క్రికెట్ దిగ్గజం సచిన్‌ ఎండుల్కర్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ, స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌.. పేర్లతో కొందరు ఆకతాయిలు ఫేక్ అప్లికేషన్లు పంపారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో చాలా వరకు మాజీ క్రికెటర్లు, ప్రముఖ నేతల పేర్లతో ఉన్నాయని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ఫేక్ అప్లికేషన్లను తొలగించే పనిలో బీసీసీఐ ఉంది.

- Advertisement -

టీమిండియా హెడ్ కోచ్‌ పదవి కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆ తర్వాత కొత్త కోచ్‌ గురించి ప్రకటన ఉంటుంది. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరి నాటికి ముగుస్తుంది. ఆ తర్వాత కొత్త కోచ్‌ పదవీకాలం జులై 1 నుంచి మొదలవుతుంది. కొత్త కోచ్ మూడున్నరేళ్ల పాటు (2027 డిసెంబరు 31 వరకు) కొనసాగుతాడు. కోచ్ పదవి కోసం ఇప్పటికే పలువురు మాజీ దిగ్గజాల పేర్లు వినిపిస్తున్నాయి. చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కోల్‌కతా మెంటార్ గౌతమ్ గంభీర్ రేసులో ముందున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement