పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ బట్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మధ్య మాటల యుద్దం చినికి చినికి గాలివానలా మారుతుంది. సల్మాన్ బట్ వ్యాఖ్యలపై వాన్ కూడా ఘాటుగానే స్పందించాడు. సెంచరీ చేయలేకపోయినా నీలా మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రం చేయలేదంటూ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్‌లో పుట్టుంటే కోహ్లికి మించిన ప్రజాదరణ లభించేదని, అతను కోహ్లిని వెనక్కు నెట్టి ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా చలామణి అయ్యేవాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాన్‌కు సల్మాన్ బట్ చురకలంటించాడు.
వన్డేల్లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయని వాన్‌కు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లి గురించి మాట్లాడే అర్హత లేదంటు ఘాటుగా విమర్శించాడు. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటతీరును కనబర్చే కోహ్లిని ఇతరులతో పోల్చడం అర్దరహితమన్నాడు. ఈ వ్యాఖ్యలకు సల్మాన్ బట్ కూడా ధీటుగా బదులిచ్చాడు. వాన్ మానసిక సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఘాటుగా విమర్శించాడు. ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్ల గురించి అనవసర చర్చను లేవనెత్తినందుకు తాను స్పందించానని, దానికి అతను పాత విషయాలను తవ్వడం ఏమాత్రం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, 2010లో మ్యాచ్ ఫిక్సింగ్వివాదంలో చిక్కుకున్న బట్.. పదేళ్ల నిషేదానికి గురైన సంగతి తెలిసిందే.