టీమిండియాపై ఎప్పుడు నోరుపారేసుకునే మైఖేల్ వాన్ మరోసారి తన మాటల తూటాలను పేల్చాడు. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదవ టెస్ట్ వాయిదా పై మైఖేల్ వాన్ బీసీసీఐ విమర్శలు గుప్పించాడు. లీగ్‌లో ఒక్క మ్యాచ్‌కు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకే భారత క్రికెటర్లు చివరి టెస్ట్ నుంచి తప్పుకున్నారని, వారికి దేశం తరఫున ఆడే టెస్ట్ మ్యాచ్ కంటే ఐపీఎల్ మ్యాచ్‌లంటేనే ముఖ్యమని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కోవిడ్ టెస్ట్ ‘నెగెటివ్’ రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన కోహ్లి అండ్ కో అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్ట్ ఆడితే ఏమయ్యేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ కాకుండా చివరకు ‘డబ్బు’ గెలిచిందని ఘాటుగా విమర్శించారు. టీమిండియా ఆటగాళ్లలో కరోనా సోకుతుందేమోనన్న భయం కంటే ఐపీఎల్‌కు దూరమవుతామనే ఆందోళన ఎక్కువైందని, అందువల్లే మాంచెస్టర్ టెస్ట్ రద్దయిందని నోరుపారేసుకున్నాడు.
ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాన్ కు కౌంటరిస్తూ భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు నలభై రోజులు ఖాళీగా కూర్చుంది. ఆ సమయంలో టెస్ట్ సిరీస్‌ను కాస్త ముందుగా జరపమన్నా వినలేదు. పైగా పనికిమాలిన ‘హండ్రెడ్’ లీగ్ కోసం రెండు, మూడో టెస్ట్‌ల మధ్య 9 రోజుల విరామం ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఐపీఎల్‌ను విమర్శించడంలో అర్థం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఇంగ్లండ్ జట్టు చేసిందేంటని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ జట్టులో కరోనా కేసులు లేకున్నా.. ఎందుకు ఆ సిరీస్ బాయ్‌కట్ చేసిందని నిలదీశాడు.
ఇది కూడా చదవండి: ధోని ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లకే మొగ్గు చూపేవాడు: అజయ్ జడేజా