అసలే వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ .ను లక్నో జెయింట్స్ బౌలర్లు బెంబేలెత్తించారు. ఒకదశలో 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై వందలోపే చాపచుట్టేలా కనిపించింది. అయితే.. ఓపెనర్ ఇషాన్ కిషన్(32), నేహల్ వధేరా(46)లు అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. చివర్లో టిమ్ డేవిడ్(35 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో పాండ్యా సేన లక్నోకు 145 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఆదిలోనే కష్టాల్లో పడింది. స్టోయినిస్, మొహ్సిన్ ఖాన్ విజృంభించడంతో బర్త్‌డే బాయ్ రోహిత్ శర్మ(4), సూర్యకుమార్ యాదవ్(10)లు వెనుదిరిగారు. 18 పరుగులకే రెండు వికెట్లు పడిన ముంబైని ఆదుకుంటాడనుకున్న తిలక్ వర్మ(7)ను బిష్ణోయ్ సూపర్ త్రోతో రనౌట్ చేశాడు. ఆ కాసేపటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా(0)ను నవీన్ ఉల్ హక్ గోల్డెన్ డక్‌గా డగౌట్‌కు చేర్చాడు. ఆ దశలో.. ఇషాన్, నేహల్ వధేరా ఒత్తిలోనూ మంచి ఇన్నింగ్స్ ఆడారు.ఆడపాదడపా బౌండరీలు బాది ఐదో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అర్ధ శతకానికి 4 పరుగుల దూరంలో ఉన్న వధేరాను యార్కర్‌తో మొహ్సిన్ ఖాన్ బౌల్డ్ చేశాడు.. ఆఖర్లో టిమ్ డేవిడ్(35 నాటౌట్) పోరాడడంతో పాండ్యా సేన 7 వికెట్ల నష్టానికి 144 రన్స్ కొట్టింది. లక్నో బౌలర్లలో మొహ్సిన్ రెండు, బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టారు