Monday, November 18, 2024

IPL 2022: ధోనీ అత్యుత్తమ ఫినిషర్: ధోనిపై సర్వత్ర ప్ర‌శంస‌ల జ‌ల్లు

ఐపీఎల్ లో భాగంగా నిన్న రాత్రి ముంబై జ‌ట్టుపై చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ విజ‌యంలో కీలక పాత్ర పోషించిన ధోనీపై చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ర‌వీంద్ర జ‌డేజా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. మ్యాచ్‌ జరిగిన తీరు చూసి చాలా కంగారు పడ్డామ‌ని, అయిన‌ప్ప‌టికీ ధోనీ వంటి అత్యుత్తమ ఫినిషర్‌ ఉండటంతో తాము గెలుస్తామనే నమ్మకం కలిగిందని అన్నాడు. త‌మ‌ జట్టు కోసం ఆడుతూ ధోనీ విజయాలు అందిస్తున్నాడని పేర్కొన్నాడు. పవర్‌ప్లేలో ముఖేశ్ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేసి జట్టుకు శుభారంభం అందించాడని తెలిపాడు. తాము ఫీల్డింగ్‌పై మ‌రింత‌ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నాడు. క్యాచ్‌లు వదిలేస్తే మ్యాచ్‌లు గెల‌వ‌లేమ‌ని చెప్పాడు.

ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా ధోనిపై ప్ర‌శంస‌లు కురిపించాడు. తాము ఈ మ్యాచ్‌లో చివరివరకూ బాగానే ఆడామ‌ని అన్నాడు. త‌మ‌ బౌలర్లు బాగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లార‌ని, అయితే, ధోనీ ఎంత గొప్ప ఆటగాడో మనకు తెలిసిందేన‌ని చెప్పాడు. ధోనీ చెన్నై జ‌ట్టుని విజయ తీరాలకు తీసుకెళ్లాడని అన్నాడు. త‌మ ఓటమికి ఇదే కారణమంటూ ఏ విషయాన్నీ వేలెత్తి చూపలేమ‌ని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం తాము శుభారంభం చేయలేదని, ఆదిలోనే వికెట్లు కోల్పోయామ‌ని, ఇలా జ‌రిగితే మ్యాచ్‌లో ఉత్సాహంగా ఆడలేమ‌ని అన్నాడు.

కాగా, ముంబయి ఇండియన్స్‌తో డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో చెలరేగిన ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కి ఊహించని విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి 156 పరుగులు చేయగా.. 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి లక్ష్యాన్ని చెన్నై ఛేదించింది. చెన్నై విజయానికి ఆఖరి 12 బంతుల్లో 28 పరుగులు అవసరమవగా.. మహేంద్రసింగ్ ధోనీ, ప్రిటోరియస్ క్రీజులో ఉన్నారు. ధోనీ మరోమారు జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు. చివరి బంతికి ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. రాబిన్ ఊతప్ప 30, అంబటి రాయుడు 40, ధోనీ 28 (నాటౌట్), ప్రిటోరియస్ 22 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో డేనియల్ శామ్స్ నాలుగు, ఉనద్కత్ 2 వికెట్లు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement