ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో స్పానిష్ లెజెండ్ రఫెల్ నాదల్ రష్యా స్టార్ మెదెదెవ్ ఆదివారం జరిగే టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు ఒక్క విజయం దూరంలో ఉన్న నాదల్ ఈ టోర్నీలో విజేతగా నిలిస్తే చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో 21వ గ్రాండ్‌స్లామ్ సింగిల్ టైటిల్ గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పనున్నాడు. సిస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, సెర్బియా స్టార్, ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్‌తో కలిసి ప్రస్తుతం నాదల్ సంయుక్తంగా 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో సమంగా ఉన్నాడు. నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్‌గా నిలిస్తే మొత్తం నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను రెండుసార్లు గెలుచుకున్న జకోవిచ్, రాయ్ ఎమర్సన్, రాడ్ లేవర్ సరసన నిలుస్తాడు.
ఆరోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరిన 35ఏళ్ల స్పానిష్ దిగ్గజం నాదల్ 2009లో టైటిల్‌ను గెలుచుకున్నాడు. కాగా ప్రపంచ రెండో ర్యాంకర్ మెదెదెవ్ వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. గత యూఎస్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్‌ను చిత్తు చేసిన మెదెదెవ్ బ్యాక్ టు బ్యాక్ మేజర్ టైటిల్స్‌కోసం ప్రయత్నిస్తున్నాడు. గత సెప్టెంబర్‌లో జకోవిచ్‌ను క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకోకుండా మెద్వెదెవ్ అడ్డుకున్నాడు. అదేవిధంగా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని భావిస్తున్న నాదల్‌ను కూడా అడ్డుకోవాలని భావిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..