ఆసియాకప్-2024 9వ ఎడిషన్ లో భాగంగా.. మరికొద్ది సేపట్లో హై వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. శ్రీలంకలో దంబుల్లా స్టేడియం వేదికగా టీమిండియా, పాక్ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి మొదలవుతోంది. కాగా, ఈసారి కూడా డిఫెండింగ్ చాంపియన్ భారత్ హాట్ పేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఎనిమిదో టైటిలే లక్ష్యంగా..
ఆసియాకప్‌లో ఎదురులేని శక్తిగా నిలిచిన టీమిండియా ఇప్పుడు ఎనిమిదో టైటిల్‌పై కన్నేసింది. ఆసియాకప్ టోర్నీల్లో టీమిండియాదే పూర్తి ఆధిపత్యం. 2004 నుంచి 2022 వరకు మొత్తం ఎనిమిది సార్లు ఆసియాకప్ పోటీలు జరగగా.. అందులో భారత జట్టు ఏకంగా 7 సార్లు విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది.
2018లో ఒకేసారి బంగ్లాదేశ్ చేతిలో ఓడి.. టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. ఇక బంగ్లాదేశ్ వేదికగా 2022లో జరిగిన చివరి ఆసియాకప్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి ఏడోసారి ఆసియా చాంప్‌గా అవతరించింది. ఇప్పుడు హర్మన్ సేన అదే జోరు కొనసాగిస్తూ భారత్‌కు 8వ టైటిల్ అందించాలని పట్టుదలతో ఉంది.
భారత్‌దే పూర్తి ఆధిపత్యం..
దాయాదులు పోరులో భారత్‌దే పూర్తి ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్-పాకిస్తాన్ జట్లు ఇప్పటి వరకూ మొత్తం 14 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. అందులో టీమిండియా 11 మ్యాచుల్లో విజయ ఢంకా మోగించగా.. పాక్ మాత్రం 3 మ్యాచుల్లోనే గెలిచింది. మరోవైపు ఆసియా కప్‌లోనూ భారత్‌దే హవా కొనసాగింది. 2012 నుంచి 2022 వరకు గత పది ఏళ్లలో ఇరు జట్లు ఆరు సార్లు తలపడగా.. అందులో భారత్ 5 సార్లు పాకిస్తాన్‌ను ఓడిచింది.
జట్ల వివరాలు: (అంచనా)
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రొడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, పూజా వస్త్రాకర్, అరుందతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళస్ హేమలత, ఆశ శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్.
పాకిస్తాన్: నిదా దార్ (కెప్టెన్), ఇరమ్ జావేద్, సాదియా ఇక్బాల్, ఆలియా రియాజ్, డయానా బేగ్, ఫాతిమా సనా, గుల్ ఫిరోజ్, మునీబా అలీ, సిద్రా అమీన్, నజిహా అల్వీ, సయ్యదా అరూబ్ షా, నష్ర సుంధు, తస్మియా రుబాబ్, ఒమైమా సోహైల్, తుబా హసన్.
ప్రపంచకప్‌కి ముందు మంచి అవకాశం..
ఈ మెగా టోర్నీ ముగిసిన కొన్ని నెలల్లోనే మహిళల టీ20 వరల్డ్‌కప్ పోటీలు జరగనుంది. దాంతో ఈ టోర్నీ భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, తదితర జట్లకు మంచి అవకాశంగా మారనుంది. ఈ టోర్నీను సన్నాహాకంగా ఉపయోగించుకుని ప్రపంచకప్‌కు సిద్ధమవ్వాలని చూస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచి 20 వరకు వరల్డ్‌కప్-2024 పోటీలు జరుగనున్నాయి.