2025 సీజన్ తొలి బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల స్టార్ డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో గాయత్రి-ట్రీసా ద్వయం 21-10, 21-10 తేడాతో స్థానిక షట్లర్లు ఒర్నిచా-సుకిత సువాచాయ్ (థాయిలాండ్) జంటను వరుస గేముల్లో చిత్తు చేసి టోర్నీలో ముందంజ వేశారు. 30 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి రౌండ్-16కు (ప్రి క్వార్టర్ ఫైనల్స్ కు) అర్హత సాధించారు.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత్‌కు భారీ షాక్ తగిలింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యువ సంచలనం లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 14-21, 7-21 తేడాతో చైనీస్ తైపీకి చెందిన యు జెన్ చేతిలో వరుస గేముల్లో చిత్తుగా ఓడాడు.
మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్‌కి చేదు అనుభవం ఎదురైంది. బ్రయాన్ యంగ్ (కెనడా)తో జరిగిన మ్యాచ్ లో భారత స్టార్ ప్రణయ్ తొలి గేమ్‌ను 21-12తో గెలుచుకున్నాడు. తర్వాత రెండో గేమ్‌లో 9-11తో హోరాహోరీగా తలపడుతున్న సమయంలో స్టేడియం రూఫ్‌లో వాటర్ లీకేజ్ కారణంగా ఈ మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోయింది. వీరు ఆడుతున్న కోర్ట్-3లో నీరు చేరడంతో రిఫరీలు మ్యాచ్‌ను నిలిపివేశారు. బుదవారం మ్యాచ్ మళ్లి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది.