కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. పారిస్ ఒలింపిక్స్ సన్నహాకాల్లో భాగంగా ప్రతిష్టాత్మక ఉబెర్ కప్‌కు దూరమైన సింధు మలేసియా మాస్టర్స్‌ను విజయంతో ఆరంభించింది. మరోవైపు అష్మిత, కిరణ్ జార్జ్‌లు కూడా ముందంజ వేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 5వ సీడ్ సింధు 21-17, 21-16తేడాతో స్కాట్లాండ్ షట్లర్ కిర్‌స్టీ గిల్‌మోర్‌ను వరస గేముల్లో చిత్తు చేసి ప్రీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. తర్వాతి మ్యాచ్‌లో సింధు దక్షిణా కొరియాకు చెందిన సిమ్ యు జిన్‌తో తలపడనుంది.
ఇక్కడ జరిగిన మరో మ్యాచ్‌లో యువ సంచలనం అష్మిత చాలిహా 21-17, 21-16 తేడాతో చైనీస్ తైపీకి చెందిన లిన్ షిన్ యిన్‌పై విజయం సాధించి టోర్నీలో ముందంజ వేసింది. దూకుడుగా ఆడిన అష్మిత 32 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఇంకో మ్యాచ్‌లో ఉన్నతి హుడా 13-21, 18-21 తేడాతో గౌ ఫాంగ్ జీ (చైనా) చేతిలో ఓటమిపాలైంది.
ఆకర్షి కశ్యప్ కూడా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ 21-16, 21-17 తేడాతో జపాన్‌కు చెందిన టకుమా ఒబయాషిపై వరుస గేముల్లో గెలిచి ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-సిక్కీ రెడ్డి జోడీ 21-15, 12-21, 21-17తో హాంకాంగ్ జంట లుయి చున్ వాయి-ఫు చి యాన్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో క్రిష్ణ ప్రసాద్-సాయి ప్రతీక్ ద్వయం కూడా ముందంజ వేసింది.