మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. రెండుసార్లు ఒలింపిక్ విజేత, 13వ ర్యాంకర్ అయిన ఆమె అద్భత ఆటతీరుతో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన యి మాన్ ఝాంగ్‌ను చిత్తు చేసింది. ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన సింధు 22-20, 13-21, 21-16 స్కోరుతో మాన్ ఝాంగ్‌ను ఓడించింది. దాంతో, ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఝాంగ్ చేతిలో ఎదురైన పరాజయానికి సింధు ప్రతీకారం తీర్చుకుంది. శనివారం జరిగే తదుపరి పోరులో జార్జియా తున్‌జుంగ్ మరిస్కా(ఇండోనేషియా)తో సింధు తలపడనుంది.
మరోవైపు తెలుగు కుర్రాడు ప్రణయ్ కూడా సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో 25-23, 18-21, 21-13తో కెంటా నిషిమొటో (జపాన్)ను ఓడించాడు. సెమీఫైనల్లో అతడు క్రిస్టియన్ ఆదినాథ (ఇండోనేషియా)తో తలపడనున్నాడు. మరో తెలుగు తేజం కితాంబి శ్రీకాంత్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతడు క్వార్టర్ ఫైనల్లో క్రిస్టియన్ ఆదినాథచేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు.