Thursday, November 21, 2024

T20 Tour | టీమిండియా జింబాబ్వే టూర్… స‌రికొత్త ప్రణాళిక‌లు

టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన వెంటనే టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 6 నుంచి 14 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో టీమిండియా ఆతిథ్య జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ పర్యటనకు టీ20 ప్రపంచకప్ ఆడే సీనియర్ ఆటగాళ్లంతా దూరం కానున్నారు.

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లకు ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో కుర్రాళ్లకు అవకాశం దక్కనుంది.

ఐపీఎల్ స్టార్లకు పిలుపు..

ముఖ్యంగా ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆటగాళ్లతో కూడిన యువ జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, విజయ్‌కుమార్ వైశాఖ్‌, యశ్ దయాల్‌లకు టీమిండియా పిలుపు వచ్చినట్లు సమాచారం.

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)కు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ కుర్రాళ్లతో పాటు కాస్త సీనియర్ ఆటగాళ్లు అయిన శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్‌, ఖలీల్ అహ్మద్‌, రుతురాజ్ గైక్వాడ్‌లకు కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

- Advertisement -

గంభీర్ పర్యవేక్షణలో..

కొత్త కోచ్ పర్యవేక్షణలో టీమిండియా ఈ పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను చేపట్టిన బీసీసీఐ.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ గంభీర్ కొత్త కోచ్‌గా ఎంపికైనా.. జింబాబ్వే పర్యటనతోనే బాధ్యతలు తీసుకుంటాడా? లేక ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తాడా? అని తేలాల్సి ఉంది.

వచ్చే వారమే జట్టు ప్రకటన..

జింబాబ్వే పర్యటనకు వెళ్లే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘వచ్చేవారం జింబాబ్వే పర్యటనకు వెళ్లే జట్టును ప్రకటించనున్నారు. అయితే ఆటగాళ్ల ఎంపిక గురించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కొత్త కోచ్‌తో మాట్లాడిన విషయం మాత్రం తెలియదు. కొత్త కోచ్ ఎంపిక ఆలస్యమైతే వచ్చే వారమే భారత జట్టును ప్రకటిస్తారు.’అని సదరు అధికారి వెల్లడించాడు.

కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్..

ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉండనున్న నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుకు అతనే సారథ్యం వహించాడు. శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్ జట్టులో ఉంటే మాత్రం ఈ ఇద్దరిలో ఒకరు సారథ్య బాధ్యతలు చేపట్టవచ్చు.
ఈ పర్యటనలో తొలి టీ20 జూలై6న, రెండో టీ20 జూలై 7న, మూడో టీ20 జూలై 10న, నాలుగో టీ20 జూలై 13న, ఐదో టీ20 జూలై 14న జరగనుంది.

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు(అంచనా)

రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, యశ్ దయాల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మయాంక్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవిబిష్ణోయ్, రియాన్ పరాగ్, రజత్ పటీదార్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్. శ్రేయ‌స్ అయ్య‌ర్

Advertisement

తాజా వార్తలు

Advertisement