ప్రభన్యూస్ : దేశవాళీ క్రికెట్‌లో బరోడా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) అధ్యక్షుడు ప్రణశ్ అమిన్‌కు లేఖను మెయిల్ చేశాడు. కేవలం కెప్టెన్సీ బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకుంటున్నట్టు వివరించాడు. ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టు ఎంపిక విషయంలో సెలెక్టర్లతో కృనాల్‌కు విభేదాలు తలెత్తినట్టు బరోడా క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కృనాల్ అభిప్రాయం తెలుసుకోకుండా సెలెక్టర్లు ఏకపక్షంగా వ్యవహరించారని, దాంతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. సెలెక్షన్స్‌కు అందుబాటులో ఉంటానని వివరించాడు. జట్టు ప్రయోజనాల కోసం తనవంతు కృషి చేస్తానని కృనాల్ పాండ్యా తన రాజీనామా లేఖలో స్పష్టం చేశాడు. కృనాల్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో బీసీఏ కేదార్ దేవ్‌ధర్‌కు పగ్గాలు అప్పగించే ఆలోచనలో బరోడా క్రికెట్ అసోసియేషన్ ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది తమిళనాడు దేశవాళీ టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital