ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూసుకెళ్లాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో అదరగొట్టిన విరాట్… బ్యాటర్ల విభాగంలో టాప్-5లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ మార్క్ తో వన్డే ర్యాంకింగ్స్ లో 887 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజంకు చేరువయ్యాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 750 రేటింగ్ ఉంది. విరాట్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే బాబర్‌ను అధిగమించడం పెద్ద విషయం ఏమీ కాదు.
ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ అద్భుతంగా రాణిస్తే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్‌ను వెనక్కి నెట్టి రెండో ర్యాంక్‌కు చేరే అవకాశముంది. మరోవైపు మహ్మద్ సిరాజ్ కూడా బౌలర్ల విభాగంలో సత్తా చాటాడు. తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శన కనబరిచిన సిరాజ్ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి 685 పాయింట్లతో మూడో ర్యాంక్ సాధించాడు.