Friday, November 22, 2024

IPL: కోహ్లీ – సౌర‌వ్ అల‌య్ బ‌ల‌య్…

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తమ పాత పంచాయితీలకు ముగింపు పలికారు. గత విషయాలన్నింటిని మరిచి ఒకరికొకరు అలయ్ బలయ్ చేసుకున్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 47 పరుగుల తేడాతో గెలుపొందింది.

- Advertisement -

ఈ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటున్న క్రమంలో సౌరవ్ గంగూలీ, కోహ్లీ ఒకరికొకరు తారసపడ్డారు. కోహ్లీని చూసిన గంగూలీ అతని గౌరవార్థం క్యాప్‌ను తీసేసి మరి అభినందనలు తెలిపాడు. అనంతరం ఇద్దరూ హగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మొన్న గంభీర్.. నేడు గంగూలీ… తమ పాత పంచాయితీలను మరిచి కోహ్లీతో స్నేహపూర్వకంగా మెదలడం బాగుందని కామెంట్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్నప్పుడే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించారు. కోహ్లీకి చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నామని గంగూలీ మీడియా ముందు చెప్పాడు. అయితే కెప్టెన్సీ మార్పు విషయంపై తనకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని అప్పట్లో కోహ్లీ స్పష్టం చేశాడు. దాంతో గంగూలీ, కోహ్లీ మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి.

తనపై ఒత్తిడి తగ్గించుకునేందుకు కోహ్లీ.. టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతలను వదిలేయగా.. 2023 వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ రోహిత్ శర్మను సారథిగా నియమించింది. వన్డే కెప్టెన్సీ వదులుకునేందుకు కోహ్లీ సుముఖంగా లేకపోవడంతో చెప్పపెట్టకుండా రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల కెప్టెన్ అని ప్రకటించింది.

ఈ నిర్ణయంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. కోహ్లీ సైతం మీడియా ముఖంగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత టెస్ట్ కెప్టెన్సీని కూడా అతను వదులుకున్నాడు. అప్పటి నుంచి కోహ్లీ, గంగూలీ ఎడ మోహం పెడ మోహంగా ఉంటున్నారు. కనీసం పలకరించుకోలేదు. ఒకరి వైపు ఒకరు ఆగ్రహంగా చూసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఇద్దరూ అలయ్ బలయ్ చేసుకోవడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement