కెరీర్లో 98వ టెస్టు ఆడనున్న టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువగా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌లోని తొలి టెస్టు ఆదివారం సెంచూరియన్ వేదికగా జరగనుంది. కాగా కోహ్లీ సెంచరీ సాధించి రెండేళ్లయింది. చివరిసారిగా నవంబర్ 2019లో కోహ్లీ టెస్టుల్లో శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత 22ఇన్నింగ్స్‌లు ఆడినా కోహ్లీ సెంచరీ సాధించలేకపోయాడు. అయితే కోహ్లీ ఫామ్‌తో సంబంధంలేకుండా టీమిండియా గెలుపుబాటలో పయనిస్తోంది. అయితే దక్షిణాఫ్రికాలో సఫారీలపై తొలిసారి సిరీస్ గెలవాలంటే కోహ్లీ బ్యాట్ ఝుళిపించక తప్పదు.
ఈక్రమంలో కోహ్లీ టెస్టుల్లో 8వేల పరుగుల మైలురాయికి 199పరుగులు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ 97టెస్టుల్లో 50.65 సగటుతో 7,801పరుగులు సాధించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ 8వేల మైలురాయికి చేరుకుంటే ఈ ఘనత సాధించిన 6వ భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 15,921పరుగులుతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ 13,265పరుగులుతో రెండోస్థానంలో, సునీల్ గవాస్కర్ 10,122పరుగులుతో మూడోస్థానం, హైదరాబాదీ స్పెషలిస్ట్ వీవీఎస్ లక్ష్మణ్ 8,871, వీరేంద్ర సెహ్వాగ్ 8,503పరుగులుతో టాప్-5లో ఉన్నారు. టీమిండియా పరుగుల మిషన్‌గా పేరున్న కోహ్లీ 2015 నుంచి 2019వరకు అన్ని ఫార్మాట్లలో పరుగుల వర్షం కురిపించాడు. రికార్డుల రారాజు కోహ్లీ మళ్లిd ఫామ్ అందుకుని సెంచరీల జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.