టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడంను తాను ఎప్పటికీ మరిచిపోలేనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) హీరో, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ అన్నాడు. తాను ఇలా హిట్టింగ్ చేయడానికి అవతల క్రీజ్‌లో దిగ్గజ క్రికెటర్ కోహ్లీ ఉండటమే కారణం అన్నాడు. విరాట్ దూకుడుగా తన మీద ఒత్తిడి లేకుండా చేసిందని జాక్స్ చెప్పాడు. గుజరాత్ టైటాన్స్‌పై అతడు విధ్వంసక శతకం చేశాడు. 41 బంతుల్లోనే సెంచరీ సాధించిన జాక్స్ .. 50 నుంచి 100 పరుగుల మార్క్ చేరుకొనేందుకు కేవలం 10 బంతులనే తీసుకున్నాడు.
సెంచరీ చేసిన విల్ జాక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కింది. ఈ సందర్భంగా తన ఆటతీరుపై జాక్స్ స్పందించాడు. ‘భారీ విజయం సాధించడం అద్భుత అనుభూతి పొందుతున్నా. ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ మంచి శుభారంభం ఇచ్చారు. క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే కాస్త ఇబ్బందిపడ్డా. విరాట్ దూకుడుగా ఆడి నామీద ఒత్తిడి లేకుండా చేశాడు. నాకు కుదురుకుని అవకాశాన్ని ఇచ్చాడు. సరిగ్గా రెండు ఓవర్లు బాగా ఆడితే.. మ్యాచ్‌ను ముగించేయొచ్చని టైమౌట్‌లో మాట్లాడుకున్నాం. మేం అనుకున్న విధంగానే జరిగింది. రెండు ఓవర్లలో భారీగా పరుగులు చేశాను. అద్భుతమైన అనుభూతిని పొందాను’ అని జాక్స్ తెలిపాడు. ‘స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు పాజిటివ్ కోణంలో ఎటాకింగ్ చేశా.
మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీగా పరుగులు చేయడంతో కాస్త రిలాక్స్ అయ్యా. నన్ను నేను నమ్మాను. మిగతా మ్యాచుల్లోనూ గెలుస్తాం. విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేను. అతను ఒక లెజెండ్. ప్రతి ఒక్కరూ కోహ్లీతో ఆడాలని కోరుకుంటారు. గొప్ప అనుభూతి ఇది. కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నా. ఇవాళ నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. తొలి 17 బంతుల్లో 17 పరుగులు చేసిన నేను ఇలా హిట్టింగ్ చేయడానికి అవతల క్రీజ్‌లో దిగ్గజ క్రికెటర్ ఉండటమే కారణం’ అని విల్ జాక్స్ చెప్పుకొచ్చాడు.