Thursday, November 21, 2024

Record | స‌చిన్ రికార్డ్ పై కోహ్లీ క‌న్ను…

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి శ్రీలంకపై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆ జట్టుపై బ్యాటింగ్‌ను అతడు ఆస్వాదిస్తుంటాడు. ఇప్పటివరకు శ్రీలంకపై 53 వన్డేలు ఆడిన విరాట్ ఏకంగా 61.2 సగటుతో 2,632 పరుగులు బాదాడు. ఇందులో 10 సెంచరీలు, 12 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ తన సత్తా చాటలేకపోతున్నాడు.

ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన అతడు 24, 14 స్వల్ప స్కోర్లు మాత్రమే చేశాడు. అయితే రేపు (బుధవారం) భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మూడో వన్డేలో రాణిస్తే ఆల్ టైమ్ గ్రేట్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూలర్క్ నెలకొల్పిన ఒక రికార్డును విరాట్ బద్దలుకొట్టే అవకాశం ఉంది. మరో రికార్డు విషయంలో సచిన్ సరసన కోహ్లీ నిలిచే అవకాశం ఉంది.

శ్రీలంకపై మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరో 114 పరుగులు సాధిస్తే వన్డేల్లో అతడి మొత్తం పరుగులు 14వేల‌ మైలురాయిని చేరుతాయి. అదే జరిగితే వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డ్ సృష్టిస్తాడు.

సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర కంటే ముందుగానే ఈ మైలురాయిని సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. 14000 పరుగుల మైలురాయిని సాధించేందుకు సచిన్ 350 వన్డేలు, సంగక్కర 378 మ్యాచ్‌లు ఆడారు. అయితే కోహ్లీ ఇప్పటివరకు 282 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

78 పరుగుల దూరంలో మరో మైలురాయి..

- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీ చేరువయ్యాడు. శ్రీలంకపై మూడో వన్డేలో మరో 78 సాధిస్తే ఈ మైలురాయిని అందుకుంటాడు. కోహ్లీ కంటే ముందు ముగ్గురు దిగ్గజాలు మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్ తర్వాత ఈ రికార్డు సాధించిన నాలుగవ ఆటగాడిగా కోహ్లీ నిలిచే అవకాశాలు ఉన్నాయి.

అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు..

  1. సచిన్ టెండూల్కర్ – 34,357 పరుగులు
  2. కుమార సంగక్కర (శ్రీలంక) – 28,016 పరుగులు
  3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 27,483 పరుగులు
  4. విరాట్ కోహ్లీ – 26,922 పరుగులు.
Advertisement

తాజా వార్తలు

Advertisement