ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ వర్సెస్ భారత్ మధ్య ఈనెల 25నుంచి ఐదు టెస్టుల సీరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మొదటి రెండు టెస్టులకూ టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల తాను మొదటి రెండు టెస్టులూ ఆడలేనని కోహ్లీ బీసీసీఐకి సమాచారమిచ్చాడు. ఈ సమాచారాన్ని బీసీసీఐ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా ఈ టెస్ట్ సీరీస్ లో ఆడటం లేదు. బ్రూక్ కూడా వ్యక్తిగత కారణాల వల్లే ఈ సీరీస్ లో ఆడలేకపోతున్నట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు కూడా హైదరాబాద్ కు చేరుకుంది. రెండు జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి..
విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉండనున్నాడని బీసీసీఐ ప్రకటించింది. తాను అందుబాటులో ఉండలేకపోతున్నానన్న విషయాన్ని కోహ్లి.. మేనేజ్‌మెంట్, సెలెక్టర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా చెప్పాడని బీసీసీఐ మీడియాతో చెప్పింది. దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని ఎల్లప్పుడూ ప్రధాన కర్తవ్యంగా భావించే కోహ్లి లాంటి ఆటగాడి నిర్ణయాన్ని గౌరవిస్తూ అతన్ని జట్టు నుంచి రిలీజ్ చేస్తున్నామని బీసీసీఐ పేర్కొంది.