Monday, November 18, 2024

Kohli : ఆల్‌టైమ్ రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!

ఐపీఎల్- 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. చెపాక్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2012, 2014 సీజన్‌లోనూ విజేతగా నిలిచిన కోల్‌కతాకు ఇది మూడో టైటిల్. అయితే ఈ సీజన్ హోరాహోరీగా సాగినా తుదిపోరు మాత్రం చప్పగా ముగిసింది. టైటిల్ పోరు ఏకపక్షంగా సాగింది.

- Advertisement -

కాగా, ఫైనల్ ముగిసిన అనంతరం ప్రెజంటేషన్‌లో అవార్డులు అందజేశారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన విరాట్ కోహ్లికి ఆరెంజ్ క్యాప్ అందజేశారు. అయితే ఫైనల్‌కు హాజరుకాని కోహ్లి తరఫున క్యాప్‌ను కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుకున్నాడు. 15 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 61 సగటు, 141 స్ట్రైక్‌రేటుతో 741 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ గైక్వాడ్ (583), రియాన్ పరాగ్ (573) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

అయితే ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్న కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక భారత ప్లేయర్‌గా కోహ్లి చరిత్రకెక్కాడు. 2016 సీజన్‌లోనూ కోహ్లి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో విరాట్ 973 పరుగులు బాదాడు. కాగా, ఐపీఎల్ ఓవరాల్‌గా అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకున్న రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 2015, 2017, 2019 సీజన్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement