ఎట్టకేలకు ఐపీఎల్ 2021 రెండవ సీజన్ లో ఓ మ్యాచ్ ప్రేక్షకులను కనువిందు చేసింది. రెండు రోజులు చప్పగా సాగిన మ్యాచ్‌లకు, బోర్ కొట్టిన ప్రేక్షకులకు చక్కటి మెరుపు విందు ఇచ్చింది కోల్‌కతా నైట్‌రైడర్స్. సిక్సర్లు, ఫోర్లతో 150 పైచిలుకు లక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ముగించేసింది. ఐపీఎల్‌లో గురువారం జరిగిన పోరులో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా జట్టు ముంబైని తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో సక్సెస్ సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, డీకాక్‌లు రాణించినప్పటికి మిగతా బ్యాట్స్మెన్‌లు పెద్దగా రాణించలేకపోవడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇది గౌరవప్రదమైన స్కోరే అయినప్పటికీ, కోల్‌కతా జట్టు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో పెద్ద ఇబ్బంది లేకుండానే సునాయాసంగా విజయం సాధించగలిగింది. రాహుల్ త్రిపాఠి 74 పరుగులతో, వెంకటేశ్ అయ్యర్ 53 పరుగులతో రాణించడంతో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. దీంతో కోల్‌కతా వరసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించగా, ముంబై రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది.
లక్ష్య చేధనలో కొల్ కత్తా ఓపెనర్లు తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టారు. బౌల్ట్ లాంటి మేటి బౌలర్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని శుబ్‌మన్ గిల్ (13), నాలుగో బంతిని వెంకటేశ్ అయ్యర్ సిక్సర్లుగా బాదారు. తర్వాత మిల్నేకు 6, 4, 4లతో అయ్యర్ తన తడాఖా చూపెట్టాడు. 2 ఓవర్లకే నైట్‌రైడర్స్ స్కోరు 30/0. బుమ్రా వేసిన మూడో ఓవర్‌లో ఇద్దరు చెరో బౌండరీ కొట్టారు. కానీ బుమ్రా… గిల్‌ను బోల్తా కొట్టించాడు. తొలి 3 ఓవర్లలోనే 40 పరుగులు రావడంతో తర్వాత కాస్త నింపాదిగా ఆడినాసరే జట్టు రన్‌రేట్ లక్ష్యాన్ని కరిగించే వరకు పది పరుగులకు దిగనేలేదు. అయ్యర్ తన ధాటిని కొనసాగించాడు. రాహుల్ త్రిపాఠి ముందు జాగ్రత్త పడ్డాడు… తర్వాత ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఇన్నింగ్స్ పదో ఓవర్లో జట్టు స్కోరు 100 దాటింది. 11వ ఓవర్లో అయ్యర్ 25 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్స్‌లు), 12వ ఓవర్లో త్రిపాఠి 29 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలను ధనాధన్‌గా అధిగమించారు. అయ్యర్ ఔటైనా త్రిపాఠి నిలబడి మిగతా లాంఛనాన్ని 15.1 ఓవర్లలోనే పూర్తి చేశాడు.
ఇది కూడా చదవండి: టీ20 ప్రపంచకప్ కోసం స్పెషల్ సాంగ్