Friday, November 22, 2024

IND-W vs NZ-W | రెండో వన్డేలో భారత్‌పై కివీస్‌ గెలుపు..

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో కివీస్‌ పుంజుకుంది. మొదటి వన్డేలో ఓడిన పర్యాటక జట్టు ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన రెండవ వన్డేలో ఘన విజయం సాధించింది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది.

ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని సవాల్‌గా విసిరింది. లక్ష్యఛేదనలో కివీస్‌ బౌలర్ల ఎదురుదాడికి భారత అమ్మాయిల వద్ద సమాధానమే లేకపోయింది. టాపార్డర్‌ చేతులెత్తేయడంతో 76పరుగుల తేడాతో కివీస్‌ గెలిచింది. సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలిగింది.

ఓపెనర్‌ స్మృతి మంథాన (0) ఖాతా తెరవకముందే పెవిలియన్‌ చేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్‌ షెఫారీ వర్మ (11), వన్‌డౌన్‌ బ్యాటర్‌ యాస్తికా భాటియా (12) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఏదశలోనూ కోలుకోలేక పోయింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ (24), జెమీమా రొడ్రిగ్యూ (17) కాసేపు ప్రత్యర్థి బౌలర్లను ప్రతిఘటించినా, ఎక్కువసేపు నిలబడలేక పోయారు. ఆఖర్లో రాధా యాదవ్‌ (48) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.

ఆమెకు దీప్తిశర్మ (15), సైమా (29) కొద్దిసేపు ఇన్నింగ్స్‌కు కాపుగాశారు. దాంతో 47.1 ఓవర్లకు 183 పరుగుల వద్ద భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 76 పరుగులతో కివీస్‌ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో సోఫీడివైన్‌, లీ తాహుహు మూడేసి వికెట్లు తీయగా, జెస్‌ కెర్ర్‌, ఎడెన్‌ క్యార్సన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకు ముందు టాస్‌ గెలిచి, బ్యాటింగ్‌కి దిగిన కివీస్‌కు ఓపెనర్లు సుజీ బేట్స్‌ (58), జార్జియా ప్లిమ్మర్‌ (41) శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (79), మ్యాడీ గ్రీన్‌ (42) కీలక ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌ భారీస్కోరు వైపు దూసుకెళ్లింది. లారెన్‌ డౌన్‌ (3), బ్రూక్‌ (8), ఇసాబెల్లా (11), జెస్‌ కెర్ర్‌ (12) త్వరగానే పెవిలియన్‌ చేరారు. భారత బౌలర్లలో రాధా యాదవ్‌ 4, దీప్తిశర్మ 2, ప్రియామిశ్రా, సైమా ఠాకూర్‌ తలో వికెట్‌ పడకొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement