Monday, November 25, 2024

Kishane Thompson | మ‌రో ఉసేన్ బోల్ట్ వ‌చ్చేస్తున్నాడు..

100 మీటర్ల పరుగు అనగానే ఉసేన్‌ బోల్ట్‌ గుర్తొస్తాడు! అతడి అనితర సాధ్యమైన రికార్డులు గుర్తొస్తాయి. తన ఆటతో హవభావాలతో స్ప్రింట్‌కు అతడు తెచ్చిన క్రేజ్‌ అలాంటిది. బోల్ట్‌ రిటైరై ఏడేళ్లయినా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు రాలేదు. బోల్ట్‌ రికార్డులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి.

ఆ రికార్డులు చెదురుతాయో లేదో గానీ.. వేగంలో ఉసేన్‌ను గుర్తుచేస్తూ అతడి దేశం జమైకా నుంచే మరో చిరుత దూసుకొస్తోంది. 100 మీటర్ల పరుగులో ఈ రెండేళ్లలోనే అత్యుత్తమ టైమింగ్‌ నమోదు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఆ అథ్లెటే కిషేన్‌ థాంప్సన్‌. జమైకా ట్రయల్స్‌లో 9.77 సెకన్లు నమోదు చేసిన థాంప్సన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

బోల్ట్‌ను అందుకోవాలని

100 మీటర్ల పరుగులో ఒక సెకన్‌ తగ్గించాలన్నా కఠోర శ్రమ చేయాలి. కొన్నిసార్లు ఎంతగా శ్రమించినా కొద్దిగైనా టైమింగ్‌ తగ్గించుకోలేక రిటైరైన అథ్లెట్లు చాలామంది ఉంటారు. అందుకే 2009 బెర్లిన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బోల్ట్‌ 9.58 సెకన్లలో సృష్టించిన ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రత్యర్థులు ఈ రికార్డు బద్దలు కొట్టడం కాదు కనీసం దరిదాపులకు కూడా రాలేకపోతున్నారు.

బోల్ట్‌ సమకాలికులు టైసన్‌ గే (9.69 సె), యెహాన్‌ బ్లేక్‌ (9.69 సె), అసాఫా పావెల్‌ (9.72 సె), గాట్లిన్‌ (9.74 సె) లాంటి వాళ్లు ఈ ఘనతను అందుకోవడానికి గట్టిగానే ప్రయత్నించి విఫలమయ్యారు. చిత్రంగా బోల్ట్‌ తర్వాత జమైకా నుంచి అంతటి స్థాయి అథ్లెట్‌ రాలేదు. కొన్నేళ్లుగా స్ప్రింట్‌లో అమెరికాదే హవా.

- Advertisement -

ఈ నేపథ్యంలో థాంప్సన్‌ వెలుగులోకి రావడం ట్రాక్‌ను వేడెక్కిస్తోంది. 22 ఏళ్ల థాంప్సన్‌కు బోల్ట్‌ రికార్డును సవాల్‌ చేసే దమ్ము ఉంది అని విశ్లేషకులు నమ్ముతున్నారు. దిగ్గజ బోల్ట్‌కు వారసుడొచ్చాడంటూ పోలికలు కూడా పెడుతున్నారు. ఎందుకంటే జమైకా ఒలింపిక్‌ ట్రయల్స్‌లో థాంప్సన్‌ ప్రదర్శించిన వేగం అలాంటిది మరి.

వేగాన్ని పెంచేశాడు

జమైకా ట్రయల్స్‌లో థాంప్సన్‌ ఆరంభించిన దానికి ముగించిన వైనానికి సంబంధమే లేదు. హీట్స్‌ వరకు వచ్చేసరికి మిగిలిన అథ్లెట్లతో దగ్గరగా టైమింగ్‌ నమోదు చేసిన అతడు.. ఫైనల్లో ప్రత్యర్థుల కంటే ఎంతో మెరుగ్గా పరుగెత్తాడు. మొదట హీట్స్‌లో 9.82 సెకన్లలో రేసు పూర్తి చేసిన అతడు.. సెమీఫైనల్లోనూ 9.84 సెకన్లలో పరుగెత్తాడు. కానీ ఫైనల్లో పరుగే చాలా భిన్నం. తొలి 60 సెకన్లు మెరుపువేగంతో దూసుకుపోయిన అతడు అందర్ని వెనక్కి నెట్టేశాడు.

ఆ తర్వాత కాస్త స్పీడ్‌ తగ్గించినా 9.77 సెకన్లలో రేసు పూర్తి చేశాడు. టేకాఫ్‌ అయిన సమయంలో అందరితో సమానంగానే కనిపించిన అతడు.. కొద్దిసేపటికే మిగిలినవాళ్లతో వేరయ్యాడు. ఆ తర్వాత బోల్ట్‌ మాదిరే ప్రత్యర్థులు దూరంలో ఉండగానే ఫినిషింగ్‌ లైన్‌ దాటాడు.

కోచ్‌ సూచన మేరకు తొలి 60 మీటర్ల దూరం వేగంగా పరుగెత్తానని.. తర్వాతి 40 సెకన్లు నెమ్మదించానని థాంప్సన్‌ వివరించాడు. అతడి టైమింగ్‌ 100 మీటర్ల రేసు చరిత్రలో తొమ్మిదో వేగవంతమైంది కావడం విశేషం. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతక విజేత అకీమ్‌ బ్లేక్‌ను కూడా వెనక్కి నెట్టాడు. ఈ నెలలో ఈ జమైకా అథ్లెట్‌ రెండోసారి అకీమ్‌ను ఓడించాడు.

మొదట జూన్‌ 6న జాతీయ ఛాంపియన్‌షిప్‌లో 9.92 సెకన్ల టైమింగ్‌తో థాంప్సన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. పారిస్‌లో పూర్తి స్థాయిలో పరుగెత్తితే కచ్చితంగా ఇంకా తక్కువ సమయంలో రేసు పూర్తి చేసే అవకాశాలున్నాయి. కానీ ఒలింపిక్స్‌లో థాంప్సన్‌కు గట్టిపోటీ ఎదురు కానుంది. అమెరికా స్టార్లు కోల్‌మన్, నోవా లేల్స్, ఫ్రెడ్‌ కెర్లీ బరిలో ఉన్నారు. మరి వారి పోటీని తట్టుకుని థాంప్సన్‌ నిలవగలిగితే ఉసేన్‌ వారసుడు వచ్చేసినట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement