ఎమ్మెస్ ధోనీ ఓ లెజెండరీ క్రికెటర్. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా, అంతకుమించి బెస్ట్ ఫినిషర్‌గా క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. గొప్ప ప్లేయర్స్ ఆ స్థాయికి చేరడం వెనుక ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉంటాయి. ధోనీ విషయంలోనూ అలాంటిది ఒకటి జరిగింది. ఈ విషయాన్ని తాజాగా మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరె వెల్లడించాడు.
2003-04 సమయంలో నిజానికి ఇండియన్ నేషనల్ టీమ్‌కు రెగ్యులర్ వికెట్ కీపర్ లేడు. లెజెండరీ ప్లేయర్ రాహుల్ ద్రవిడే ఆ బాధ్యతలు కూడా మోస్తున్నాడు. టీమ్‌లో కీలక బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా అతడు విజయవంతమయ్యాడు. 2003 వరల్డ్‌కప్‌లోనూ ఆడాడు. అయితే ఎక్కువ కాలం ఇలా కొనసాగకూడదని, ఇండియన్ టీమ్‌కు ఓ రెగ్యులర్ వికెట్ కీపర్ కావాల్సిందనని సెలక్టర్లు భావించారు. అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తున్న ధోనీ గురించి చీఫ్ సెలక్టర్ కిరణ్ మోరె తెలుసుకున్నాడు. ఆట చూసి తెగ ముచ్చటపడిన మోరె.. అతన్ని దిలీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడించాలని అనుకున్నాడు. దీనికోసం అప్పటి కెప్టెన్ గంగూలీ వెంట పడ్డాడు. దాదాకు మాత్రం తుది జట్టులో తన కోల్‌కతాకే చెందిన దీప్‌దాస్ గుప్తాను ఆడించాలని ఉంది. దీంతో గంగూలీని ఒప్పించడానికి తాము చాలా ప్రయాస పడాల్సి వచ్చిందని కిరణ్ మోరె చెప్పాడు. ఏకంగా 10 రోజుల పాటు దాదాను బతిమాలితే మొత్తానికి అతడు అంగీకరించాడు అని మోరె తెలిపాడు.
ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసిన ధోనీ, రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లోనే 60 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో ఆ వెంటనే ధోనీని ఇండియా ఎ టీమ్ తరఫున కెన్యాలో జరిగిన ట్రయాంగిల్ టోర్నీకి పంపించారు. అందులో పాకిస్థాన్ ఎ టీమ్ కూడా ఉంది. ఈ టోర్నీయే ధోనీ కెరీర్‌ను మలుపు తిప్పిందని మోరె చెప్పాడు. అందులో అతడు ఏకంగా 600 పరుగులు చేశాడు. అందుకే ఏదో ఒక ప్రత్యేకత ఉన్న క్రికెటర్‌కు అవకాశం ఇవ్వాలని నేను పదే పదే చెబుతాను. ధోనీలో అన్నీ ఉన్నాయి. మేము సరైన గుర్రంపై పందెం కాశాము. ఒకవిధంగా సెలక్షన్ కమిటీ మొత్తానికీ ఈ క్రెడిట్ వెళ్తుంది అని మోరె చెప్పాడు.