యువ ఆల్‌రౌండర్, హర్యానా క్రికెటర్ అన్షుల్ కంబోజ్ నిప్పులు చెరిగాడు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా సి జట్టు తరుఫున ఆడుతున్న అన్షుల్ కంబోజ్.. ఇండియా బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. బ్యాటింగ్‌లో 38 పరుగులే చేసినా.. బౌలింగ్‌లో మాత్రం నిప్పులు చెరిగాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనే తొలి సారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
523 పరుగుల టార్గెట్ తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-బి జట్టు కు అన్షుల్ కంబోజ్ షాక్ ఇచ్చాడు. మూడో రోజు మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలం లేని ఫ్లాట్ వికెట్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఐదు కీలక వికెట్లు తీసాడు. ఇక విజయ్‌కుమార్ వైషాక్, మయాంక్ మార్కండే చెరో వికెట్ సాధించారు.
అయితే, ఇండియా బి జట్టు కూడా ధీటుగా జవాబిస్తుంది. మూడో ఆట ముగిసేసరికి 101 ఓవర్లకు 309/7 పరుగులు సాధించింది. దీంతో 216 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(143 బ్యాటింగ్) సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి తోడుగా రాహుల్ చాహర్ (18 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకముందు నారాయణ్ జగదీశన్ (70) అర్థ శతకంతో రాణించాడు.