Saturday, November 23, 2024

జూనియర్‌ వరల్డ్‌ కప్‌ హాకీ విజేత అర్జెంటీనా.. ఫ్రాన్స్‌కు కాంస్యం

ప్ర‌భ‌న్యూస్ : హాకీ పురుషుల జూనియర్‌ ప్రపంచకప్‌ విజేతగా అర్జెంటీనా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అర్జెంటీనా జర్మనీని ఓడించి ఎఫ్‌ఐహెచ్‌ హాకీ పురుషుల జూనియర్‌ ప్రపంచకప్‌ ఛాంపియన్స్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తుదిపోరులో అర్జెంటీనా జూనియర్‌ హాకీ జట్టు 4-2తేడాతో జర్మనీ జట్టుపై విజయం సాధించింది. కాగా పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ టైటిల్‌ను అర్జెంటీనా గెలుచుకోవడం ఇది రెండోసారి. అర్జెంటీనాకు లభించిన మూడు పెనాల్టి కార్నర్‌లు గోల్స్‌గా మలిచిన లాటరో డొమెనే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. చివరి నిమిషంలో అగోస్టినీ మరో గోల్‌ చేయడంతో అర్జెంటీనా ఛాంపియన్‌ ట్రోఫీని చేజిక్కించుకుంది. జర్మనీ తరఫున హేనర్‌, ఫాండ్ట్‌ చెరో గోల్‌ సాధించారు.

నాలుగోస్థానంతో సరిపెట్టుకున్న భారత్‌
ఒడిశాలో జరుగుతున్న పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ 2021లో ఆదివారం జరిగిన కాంస్యపోరులో ఫ్రాన్స్‌ 3-1తేడాతో భారత్‌ను ఓడించింది. కళింగ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ కెప్టెన్‌ తిమోతి క్లెమెంట్‌ టోర్నీలో నాలుగోసారి హ్యట్రిక్‌ నమోదు చేశాడు. ఈక్రమంలో భారత్‌పై రెండోసారి హ్యాట్రిక్‌ గోల్స్‌ నమోదు చేశాడు.
తిమోతి 26, 34, 47వ నిమిషాల్లో పెనాల్టి కార్నర్స్‌ను గోల్స్‌గా మలిచాడు. మూడో క్వార్టర్‌లో భారత్‌ తరఫున సుదీప్‌ చిర్మాకో 42వ నిమిషంలో ఏకైక గోల్‌ చేశాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌పై ఫ్రాన్స్‌ ఆద్యంతం ఆధిపత్యం సాధించింది. ఈ మెగాటోర్నీలో ఫ్రాన్స్‌ చేతిలో భారత్‌ ఓడిపోవడం ఇది రెండోసారి.. ఒకే గ్రూప్‌లో ఉన్న ఫ్రాన్స్‌, భారత్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లోనూ ఫ్రాన్స్‌ భారత్‌పై విజయం సాధించింది. ఫ్రాన్స్‌ కెప్టెన్‌ తిమోతి జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ 2021లో తన పేరిట 14గోల్స్‌ నమోదు చేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement