( ఆంధ్రప్రభ విజయవాడ) : రాష్ట్ర స్థాయి టెన్నిస్ టోర్నమెంట్లో నగర బాలిక గోలి జోషిత మెరిసింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి టెన్నిస్ టోర్నీ అండర్-17 విభాగంలో విజయవాడకు చెందిన యువ టెన్నిస్ క్రీడాకారిణి గోలి జోషిత ద్వితీయ స్థానంలో నిలిచింది.
కాకినాడలోని డి ఎస్ ఏ స్టేడియంలో నిర్వహించిన పోటీలలో అద్భుత ప్రదర్శన జోషిత చూపించింది. విజయవాడలోని గొల్లపూడిలోని జైన్ కాలనీలోని కె ఏ టెన్నిస్ అకాడమీలో కోచ్ వద్ద శిక్షణ పొందిన జోషిత నిరంతరం క్రీడ పట్ల అసాధారణమైన నైపుణ్యాలను, అంకితభావాన్ని ప్రదర్శించింది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పోటీల్లో కూడా జోషిత అద్భుత ప్రదర్శన కనపరిచి విజేతగా నిలిచింది.
జోషిత సాధించిన విజయాలకు ఆమె తల్లిదండ్రులు కోచ్ తో పాటు తోటి స్నేహితులు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. జోషిత విజయం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రాంతాలలో ఉన్న ఔత్సాహిక యువ క్రీడాకారులకు ప్రేరణగా ఉపయోగపడుతుందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.